Andhra Pradesh: ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.. ఎలాగైనా ఆపెయ్.. అంటూ నేరుగా వరుడికే ఫోన్ చేసి చెప్పిన వధువు.. చివరకు జరిగిన ఘోరమిది..!

ప్రతీకాత్మక చిత్రం

నీతో నిశ్చయమైన పెళ్లి నాకు ఇష్టం లేదు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపెయ్. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆ తర్వాత జరిగే ఘోరాలకు నాది బాధ్యత కాదు.. అంటూ ఆ యువతి నేరుగా వరుడికే ఫోన్ చేసి చెప్పింది. చివరకు..

  • Share this:
    ’నీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. మా నాన్నకు ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వయినా నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లిని ఆపేయించు. ఒకవేళ బలవంతంగా చేసినా ఆ తర్వాత జరగరానిది జరిగితే నాదేం బాధ్యత కాదు. చావనైనా చస్తా కానీ ఈ పెళ్లి మాత్రం చేసుకోను‘ అంటూ నేరుగా వరుడికే ఫోన్ చేసి చెప్పిందా యువతి. తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లిచేస్తున్నారని వాపోయింది. దీంతో అతడు నేరుగా ఆ యువతి తండ్రికి ఫోన్ చేశాడు. పెళ్లిచూపుల్లోనూ, నిశ్చితార్థం సమయంలోనూ చెప్పకుండా పెళ్లికి కొద్ది రోజులుందనగా ఇదేం వ్యవహారం అంటూ నిలదీశాడు. దీంతో ఆ యువతి ఇంట్లో పెద్ద రచ్చే జరిగింది. యువతిని ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన కుంచపు ఆదినారాయణ, లక్ష్మిదేవికి ముగ్గురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. భార్య లక్స్మీ దేవి 12 ఏళ్ల క్రితమే మరణించింది. దీంతో కవిత అనే మహిళను 2015వ సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు కూడా కలిగాడు. మొదటి భార్య పిల్లలతో సహా రెండో భార్యను, ఆమె కొడుకును ఒకే ఇంట్లో ఉంచుతూ బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవలే మొదటి భార్య పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. రెండో కుమార్తె 23 ఏళ్ల వయసున్న సురేఖ పీజీ పూర్తి చేసింది. ఆమెకు నల్లమడకు చెందిన ఓ యువకుడితో పెళ్లిని నిశ్చయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది.

    అయితే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ ఆ యువతి కొద్ది రోజులుగా ఇంట్లో గొడవ పడుతూ ఉంది. ఈ క్రమంలోనే మంగళవారం నేరుగా సురేఖ వరుడికి ఫోన్ చేసింది. ‘నీతో నిశ్చయమైన పెళ్లి నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపెయ్. బలవంతంగా పెళ్లి జరిగితే మరుసటి రోజే ఆత్మహత్య చేసుకుంటా.‘ అంటూ వరుడికి ఫోన్లోనే చెప్పింది. దీంతో అతడు ఆ యువతి తండ్రి ఆదినారాయణకు ఫోన్ చేశాడు. ‘అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని అంటోంది. నాకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లిచూపుల్లోనూ, నిశ్చితార్థంలో కూడా ఏమీ చెప్పలేదు. మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉంది. మా పరువేం కావాలి. ఇలా చేస్తున్నారేంటి? మీ అమ్మాయితో మాట్లాడండి. ఏదో ఒక విషయం త్వరగా తేల్చండి‘ అంటూ మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు సురేఖను మందలించారు. మనస్తాపం చెందిన సురేఖ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందును తాగింది. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు సురేఖ అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: