కొన్ని గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ చకచకా సాగుతున్నాయి. అమ్మాయి తరఫు బంధువులు ఇంట్లో ఒకటే హడావిడి. పెళ్లి కూతురుకు అప్పుడే పెళ్లి కళ వచ్చిందని.. ఇక కొద్దిరోజులైతే తమను మరిచిపోతుందని ఇంటికొచ్చిన బంధువులు ఆమెను ఆటపట్టిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ చిరునవ్వు చిందిస్తున్న ఆ కాబోయే వధువు.. గుండెలనిండా బాధే. ఆ బాధ ఎందుకో అక్కడున్న వారిలో ఆమెకు మాత్రమే తెలుసు. తీరా వివాహ తేది రానే వచ్చింది. గురువారం పెళ్లి. ఇంటికి వచ్చిన చుట్టాలు, ఇంటి పక్కవాళ్లతో ఇళ్లంతా సందడిగా ఉంది. తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిసేపు గడిస్తే ఆ శుభగడియ అయిపోయేదే. ఇంతలో పిడుగులాంటి వార్త. కూతురు కనిపించడం లేదని... తన గదిలోకి వెళ్లి వెతికారు. కనిపించలేదు. కానీ ఒక లెటర్ కనిపించింది. ‘నన్ను క్షమించండి.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నేను ప్రేమించిన వాడితో వెళ్లిపోతున్నానని...’ అందులో ఉంది. అది చదివిన ఆ తండ్రి అక్కడే కులబడిపోయాడు. తల్లి రోదన మిన్నంటింది. ఇంతకీ ఏమైందంటే..
కొన్ని గంటల్లో పెళ్లనగా వధువు ప్రేమికుడిని పెళ్లి చేసుకునేందుకు వెళ్లి పోయింది. ఈ ఘటన గురువారం సిరిసిల్ల జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లికి చెందిన లావణ్య, శ్రీనివాస్ కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. వాళ్లు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే లావణ్య తల్లిదండ్రులు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఆ క్రమంలోనే మరో అబ్బాయితో వివాహం నిశ్చయించారు. పంతులుగారు గురువారం ముహుర్తం పెట్టారు. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలోనే పెళ్లి కూతురు వాళ్లింట్లో పిడుగులాంటి వార్త.
పెళ్లి కుమార్తె లావణ్య.. తాను ప్రేమించిన శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లెటర్ రాసి గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. లెటర్ చూసి షాక్ కు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లావణ్య, శ్రీనివాస్ ల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Published by:Srinivas Munigala
First published:January 07, 2021, 21:31 IST