ఈ కాలం పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. చిన్న విషయాలను సైతం పెద్దదిగా భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. తండ్రి తిట్టాడని, అమ్మ మందలించిందన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర విషాదం మిగుల్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి కొట్టాడని 13 ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగాడు. మల్దకల్ మండలం, మల్లేందొడ్డిలో సెల్ ఫోన్ వివాదం ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. వివరాల ప్రకారం.. గ్రామంలో ఈ రోజు ఉదయం ముద్దుల గోపాల్, అతడి కొడుకు తిరుమలేష్(13)కు మధ్య సెల్ ఫోన్ విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం పెద్దదైంది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి ముద్దుల గోపాల్ కొడుకును తీవ్రంగా కొట్టాడు. దీంతో తిరుమలేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో చనిపోవాలని భావించాడు. ఈ క్రమంలో ఇంట్లో పంట పొలం కోసం తెచ్చిపెట్టిన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కొద్ది సేపటికి తండ్రి ముద్దుల గోపాల్ ఇంటికి వచ్చి చూసేసరికి తిరుమలేష్ అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో కొడుకు పురుగుల మందు తాగినట్టుగా గుర్తించి హుటాహుటిన గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించాడు.
అయితే అక్కడి వైద్యులు తిరుమలేష్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒక చిన్న సెల్ ఫోన్ వివాదం కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు ప్రాణంమీదకు తెచ్ఛిందని బాధిత కుటుంబీకుల బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.