BOMB EXPLODES IN TIFFIN BOX CHICKEN FEATHERS INSTEAD OF A BOMB VB KNR
Telangana: టిఫిన్ బాక్స్ లో బాంబ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తో నిర్వీర్యం చేయగా షాక్.. బాంబ్ కు బదులు..
ఘటనా స్థలం వద్ద పోలీసులు, స్క్వా డ్ బృందం సభ్యులు
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల కాల్పుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు . ఈ నేపథ్యంలో టిఫిన్ బాక్స్ లో బాంబు ఉందంటూ సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. అధికారులు అక్కడకు చేరుకొని టిఫిన్ బాక్స్ తెరవగా అందులో బాంబు లేదు.. కానీ..
మావోయిస్టుల కాల్పులతో రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడ చిన్న అలజడి ఏర్పడినా పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలం వద్ద వాలుతున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ లో బాంబు ఉందంటూ సమాచారం రావడంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్ డిస్పోజల్ బృందం సభ్యులు ఆ ప్రాంతంలో క్షుణ్నంగా తనిఖీ చేపట్టారు. టిఫిన్ బాక్స్ ఉన్న ప్రాంతాన్ని జేసీబీ సహాయంతో లోతుగా తవ్వి సురక్షితంగా టిఫిన్ బాక్స్ ను వెలికితీశారు. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమోనని పోలీసులు ఆ ప్రాంతాన్ని జేసీబీతో తవ్వించారు. ప్రస్తుతం ఒక టిఫిన్ బాక్స్ మాత్రమే బయటపడింది. దాన్ని నిర్వీర్యం చేయగా పోలీసులు, డిస్పోజల్ బృందం సభ్యులు షాక్ కు గురయ్యారు. టిఫిన్ బాక్స్ లో బాంబుకు బదులు కోడి ఈకలు లభించాయి.
దీంతో అక్కడ ఉన్న అధికారులు అవాక్కయ్యారు. ఎందుకైనా మంచిదని చుట్టు పక్కల ప్రాంతమంతా తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఏమి కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల - నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతం. అప్పట్లో నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ ను పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. టిఫిన్ బాక్స్ ను వెలికితీసిన పోలీసులు, ఎక్కడ ఎలాంటి మందుపాతరలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
టిఫిన్ బాక్స్ లోని కోడి ఈకలు
ఘటనా స్థలం వద్ద జేసీబీతో తవ్వించిన అధికారులు
ఒక టిఫిన్ బాక్స్ బయటకు కనిపించడం అటవీశాఖ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బయటపడ్డ టిఫిన్ బాక్స్ పై పోలీసులు విచారణ చేపట్టారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల నేపథ్యంలో తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ బాక్స్ వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.