ఝజ్జర్: ఆమె ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ సీనియర్ మేనేజర్. ఉన్నతమైన ఉద్యోగం. సమాజంలో గౌరవం. ఆమె భర్త కూడా మరో బ్యాంకులో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు. కానీ.. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు ఆమె జీవితాన్ని పొట్టనపెట్టుకున్నాయి. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది. హర్యానాలోని ఝజ్జర్‌లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిల్పీ సోనమ్ అనే మహిళకు జూన్ 6, 2014న రాకేష్ శర్మతో వివాహమైంది. సోనమ్ పెళ్లయన కొత్తలో బీహార్‌లోని సీతామర్హిలో సర్వ హర్యానా గ్రామీణ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసింది. రాకేష్ హర్యానాలోని సోనీపట్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు.
సోనమ్ పెళ్లయిన కొన్నాళ్లకు సోనిపట్ జిల్లాలోని బ్యాంక్ బ్రాంచ్‌కు బదిలీ అయింది. అప్పటి నుంచి రాకేష్, సోనమ్ అక్కడే ఇల్లు తీసుకుని కలిసి ఉంటున్నారు. భార్యతో చాలా సంవత్సరాలు ఆనందంగానే గడిపిన రాకేష్ ఇటీవల డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దీంతో.. అతనిని మార్చేందుకు సోనమ్ ఎంతగానో ప్రయత్నించింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవలు కొన్నాళ్లకు ముదిరి పాకాన పడ్డాయి. రాకేష్‌తో డ్రగ్స్ తీసుకోవడాన్ని మాన్పించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సోనమ్ రాంచీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. రాకేష్ ఆమెను కలిసేందుకు అప్పుడప్పుడూ రాంచీ వెళ్లి వస్తుండేవాడు. సెప్టెంబర్ 4న స్థానికంగా జరుపుకునే పండుగ సందర్భంగా సోనమ్ తన పిల్లలను తీసుకుని భర్త దగ్గరకు వెళ్లింది. ఐదేళ్ల బాబుతో పాటు ఎనిమిది నెలల పాపను తీసుకుని సోనమ్ వెళ్లింది. ఆ సమయంలో.. ఇంట్లో కండోమ్ ప్యాకెట్స్, డ్రగ్స్ చూసి సోనమ్ షాకైంది. భర్త చెడు అలవాట్లపై రాకేష్‌ను నిలదీసింది. ఆ క్రమంలో సోనమ్‌పై రాకేష్ చేయి చేసుకున్నాడు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందిన సోనమ్ తన అన్నయ్యకు ఫోన్ చేసి బాధపడింది. అక్కడ ఉండొద్దని.. వచ్చేయమని ఆమెకు అన్నయ్య చెప్పాడు. అయితే.. ఈ పరిణామాలతో తీవ్ర కలత చెందిన సోనమ్ అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
అయితే.. తన చెల్లి ఆత్మహత్య చేసుకోలేదని, రాకేష్ చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని సోనమ్ అన్నయ్య దీపక్ ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదుతో బహదూర్గర్ పోలీసులు రాకేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోనమ్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు. సోనమ్ చనిపోవడంతో ఎనిమిది నెలల పాప, ఐదేళ్ల బాబు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆ బాబు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బహదూర్గర్లోని ఒమాక్స్ సొసైటీలోని ఫ్లాట్‌లో రాకేష్ శర్మ నివాసం ఉండేవాడు. అదే ఫ్లాట్‌లో సోనమ్ ఆత్మహత్యకు పాల్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Baroda, Crime news, Married women, Wife suicide