దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ చేసి ఇవాల్టీతో 12 రోజులు పూర్తయ్యింది. ఈ ఘటనపై NHRC ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో నలుగురు మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోలీసులు భద్రపరిచారు. అయతే వీరి మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. దీంతో పోలీసుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఇటు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హెల్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్కు గాంధీ ఆస్పత్రి అధికారులు లేఖ కూడా రాయాలనుకుంటున్నారు. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో పోలీసులు వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. నిజానికి ఈ నెల 13 వరకే భద్రపరచాలని చెప్పినప్పటికీ స్పష్టత లేకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి.
అయితే డెడ్ బాడీలకు ఎంబాంబింగ్ చేస్తే మరో రెండువారాలపాటు భద్రపరిచే అవకాశం ఉన్నప్పటికీ రీపోస్టుమార్టానికి అవకాశం ఉండదు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మార్చురీలో ఫ్రీజర్లో లో టెంపరేచర్లో ఉంచినప్పటికీ మరో వారం వరకు మాత్రమే మృతదేహాలు చెడిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో తేలేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలిసే పరిస్థితి లేదు. దీంతో మృతదేహాలను ఏం చేయాలో తెలియక పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే, ఢిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలన్న యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. త్వరగా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వాలని అటు కుటుంబసభ్యులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Disha murder case, Priyanka Reddy, Priyanka reddy murder, Shadnagar encounter, Shadnagar rape, Supreme Court, TS Police