ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు కొత్తచిక్కొచ్చింది. సీజ్ చేసి... భద్రంగా దాచిపెట్టిన మద్యంలో చుక్క కూడా లేకపోవడంలో... మందు అంతా ఎక్కడికిపోయిందో అర్థం కాలేదు రక్షక భటులకు. ఖాళీగా కనిపిస్తున్న క్యాన్లకు రంధ్రాలు ఉండడం, అక్కడ ఎలుకలు తచ్చాడుతూ కనిపిస్తుండడంతో... ఇది కచ్చితంగా మూషికాల పనే అని ఫిక్స్ అయిపోయారు పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న వెయ్యి లీటర్ల మద్యాన్ని ఎలుకల గుంపు తాగేసిందని నివేదిక వెల్లడించారు యూపీ పోలీసులు. కొన్నాళ్ల క్రితం బీహార్ పోలీసులు కూడా ‘తాగుబోతు ఎలుకల’ గురించి చెప్పిన విషయం తెలిసిందే. అప్పుడు 9 లక్షల లీటర్ల తాగేసిన ఎలుకలు... ఇప్పుడు యూపీలో వెయ్యి లీటర్లు తాగేయడంతో ఈ ‘డ్రంకెన్ ర్యాట్స్’ గ్యాంగ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
రాయ్‌బరేలీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఖరీదైన మందు సీసాలను పోలీస్ స్టేషన్లో ఓ గదిలో పెట్టి, భద్రంగా తాళం కూడా వేశారు పోలీసులు. అయితే రెండు రోజుల తర్వాత మద్యం సీసాలను పరిశీలించగా... క్యాన్లు ఉన్నాయి కానీ అందులో లిక్కర్ మాయమైంది. అసలేమైందని పరిశీలించి చూడగా... ‘ఫుల్లుగా మందేసి... తూగుతూ కనిపించాయట’ ఎలుకలు. ఈ విషయాన్ని స్వయంగా పోలీస్ బాస్ చెప్పడం విషయం. నిజానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాటిని చట్టపరమైన ప్రొసెసింగ్ కోసం కొంత మొత్తంలో సేకరించి... మిగిలినదాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అలా ధ్వంసం చేయకుండా... భద్రంగా దాచిపెట్టిన లిక్కర్ మాయం కావడం... దాన్ని ఎలుకలు తాగడంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ తాగుబోతు ఎలుకల గ్యాంగ్... వైన్ షాపులపైకి, బార్లపైకి దండెత్తితే పరిస్థితి ఏంటా? అని భయాందోళనలకు గురవుతున్నారు మందుబాబులు.
ఇవి కూడా చదవండి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime