#జర భద్రం: మూఢనమ్మకం సమాజానికి హానికరం!

మూఢనమ్మకాలు సమాజంలో కలకలం రేపుతున్నాయి. అనుమానాలు, ఆరోపణలు, ఆశలు, గుడ్డి నమ్మకాలు... చివరకు ప్రాణాలు తీసే పరిస్థితులకు దారితీస్తున్నాయి.

Santhosh Kumar S | news18-telugu
Updated: August 8, 2018, 11:48 AM IST
#జర భద్రం: మూఢనమ్మకం సమాజానికి హానికరం!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఘటన-1
ఆగస్ట్ 3... ముద్దులొలికే ఐదేళ్ల చిన్నారిని కన్నవాళ్లే చంపేశారు. ఆ అమ్మాయి అనారోగ్యంతో బాధపడటం ఓ కారణమైతే... ఆ పాపను చంపి ఇంట్లోనే పూడ్చేస్తే తర్వాత పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉంటుందని ఓ తాంత్రికుడు చెప్పడం మరో కారణం. ఆ తాంత్రికుడు చెప్పాడని ఆ పసిపాపకు ఐదు రోజుల పాటు తిండిపెట్టకుండా, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఘటన-2
జూలై 29... క్షుద్రపూజల వ్యవహారంలో ఒకడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేశాడు. కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుజాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. ఇందులో ప్రధాన నిందితుడు అనీష్. భూతవైద్యుడు, జ్యోతిష్యుడైన కృష్ణన్ కుటుంబానికి అనీష్ సన్నిహితుడు. కృష్ణన్ దగ్గర క్షుద్రపూజలు నేర్చుకున్న అనీష్ సొంతగా దుకాణం తెరిచాడు. అయితే తన శక్తులన్నింటినీ కృష్ణన్ లాగేసుకున్నాడని అనుమానించిన అనీష్ పగబట్టాడు. అంతే... జూలై 29న ఇంటికెళ్లి మరీ అనీష్ కుటుంబాన్ని హతమార్చాడు. మృతదేహాలను ఇంటివెనకే పాతిపెట్టాడు. ఈ హత్యలకు గల కారణాలేంటని పోలీసులు ఆరా తీస్తే క్షుద్రపూజలు, అతీత శక్తుల వ్యవహారం బయటపడింది.

ఘటన-3
జూలై 27... ఆరోజు సుదీర్ఘ చంద్రగ్రహణం. గ్రహణాల సమయంలో క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. కృష్ణా జిల్లా నూజివీడు మండలం యలమందలో ఏకంగా నరబలికి ఏర్పాట్లు చేశారు. పెద్దపెద్దగోతులు తవ్వి... ఓ యువకుడిని బలి ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. కానీ ఆ యువకుడు తప్పించుకోవడంతో నరబలి తతంగానికి తెరపడింది.

సరిగ్గా పదిరోజుల వ్యవధిలో సంచలనం సృష్టించిన మూడు ఘటనలివి. మూడు ఘటనల మూఢనమ్మకాలకు సంబంధించినవే. అసలేంటి ఈ గుడ్డి నమ్మకాలు? 3జీ దాటి 4జీ నుంచి 5జీ స్పీడ్‌లో దూసుకెళ్లేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. విమానాల్లో దేశాలు, ఖండాలు దాటేస్తున్నాం. రాకెట్లో వెళ్లి గ్రహాలపై అడుగుపెడుతున్నాం. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో 4జీ స్పీడ్‌లో అభివృద్ధి సాధిస్తున్నాం. అయినా మనుషుల స్వభావాలు, నమ్మకాలు ఇంకా రాతియుగంవైపు పరుగులు తీస్తున్నాయి ఎందుకు? ఎవరికీ హాని చేయని నమ్మకం, విశ్వాసం ఏదైనా పాటిస్తే తప్పుకాదని అంటుంటారు. కానీ ఈ దారుణాలన్నీ అలాంటివి కావు. గుడ్డి నమ్మకాలతో ప్రాణాలు తీసేవే. మొరాదాబాద్ ఘటనలాగా పిచ్చి నమ్మకాలతో పసివాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. కేరళలోని దారుణంలాగా కుటుంబాలకు కుటుంబాలనే అంతం చేస్తున్నారు. ఇవే కాదు అంధవిశ్వాసాలు, మాయలు, మంత్రాలు, తాంత్రిక పూజలు, క్షుద్రపూజల పేరుతో దేశంలో జరుగుతున్న దారుణాలెన్నో. దేశరాజధాని ఢిల్లీలోని బురారీలో 11 మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలోనూ ఆధ్యాత్మిక కోణం బయటపడింది. అందరూ మూఢనమ్మకాలతో బలవన్మరణానికి పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలింది.black magic superstitions are reasons for murders

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలెన్నో జరుగుతుంటాయి. ఘటన బయటపడ్డప్పుడే కాస్త హడావుడి జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలే. గతంలో కరీంనగర్‌లో మంత్రాల నెపంతో ఓ కుటుంబాన్ని ఊరంతా వెలివేసింది. ఊళ్లో ఎవరికి ఏ చిన్న జబ్బు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ కుటుంబం చేస్తున్న క్షుద్రపూజలే కారణమంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. పంచాయతీకి పిలిపించి వేడివేడి నూనెలో చేతులు పెట్టి పరీక్షలు పెట్టేవారు. ఇలా వేధించినవారిలో ఆ దంపతుల దగ్గరి బంధువులు కూడా ఉన్నారంటే... అంధవిశ్వాసాలు ఏ స్థాయిలో ముద్రవేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఆ అవమానాలు, ఆరోపణలు తట్టుకోలేక ఏ పాపం తెలియని కుటుంబం సామూహికంగా ఈ లోకం నుంచి నిష్క్రమించడం సంచలనం సృష్టించింది. 9... 6... 4... ఏళ్ల వయస్సుగల ముగ్గురు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు.


అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో గుప్తనిధుల కోసం ఏకంగా ఓ చిన్నారిని బలిచ్చారు. ఇవేకాదు... మంత్రాల నెపంతో జరిగే దాడులు అనేకం. నిజామాబాద్‌లో ఓ వ్యక్తి ఏకంగా తన భార్యను క్షుద్రపూజల్లో బలిచ్చాడు. తమకు ఏ చిన్న హాని జరిగినా ఎవరో మంత్రాలు చేశారని గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఈ అంధవిశ్వాసాలు అన్ని చోట్ల ఉన్నాయి. కాకపోతే పల్లెల్లో ఇలాంటి నమ్మకాలు ఎక్కువ. ఘోరాల్లో చాలావరకు గ్రామాల్లో జరిగేవే. అయితే ఇంతకుముందుతో పోలిస్తే గ్రామాల్లోనూ సాంకేతికత వినియోగం పెరిగింది. ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. అవగాహన, చైతన్యం పెంచుకుంటున్నారు. అయినా అంధవిశ్వాసాల జాఢ్యాన్ని వదిలిపెట్టట్లేదు. మంత్రాల నెపంతో, క్షుద్రపూజల భయంతో, గుప్తనిధుల ఆశతో ప్రాణాలు తీస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

జనంలో మూఢనమ్మకాలు అలాగే ఉండటానికి కారణం ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్దపెద్ద చదువులు చదివిన వాళ్లు కూడా యజ్ఞాలు, యాగాలు చేస్తుండటమే. బాగా చదువుకున్నోళ్లే ఇలాంటివి నమ్ముతున్నారని సామాన్యులు కూడా వాటిని అనుసరిస్తున్నారు. రాజ్యాంగంలో చెప్పినట్టు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తామని ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు కూడా కొన్ని నమ్మకాలను పాటిస్తూ వార్తల్లో నిలుస్తుండటం... జనంలో మూఢనమ్మకాలు పెరగడానికి కారణం.
న్యూస్ 18 తెలుగుతో... టీవీ రావు, జన విజ్ఞాన వేదిక జాతీయ సలహాదారు


black magic superstitions are reasons for murders

ఇటు పట్టణాల్లోనూ అంధవిశ్వాసాలను పాటించే జనాలున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆరు నెలల క్రితం ఉప్పల్ చిలుకా నగర్‌లో నరబలి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడూ చంద్రగ్రహణమే. సరిగ్గా జనవరి 31న అర్థరాత్రి జరిగింది ఈ దారుణం. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఓ చిన్నారిని బలి ఇవ్వడమే కాదు... ఆ పసిపాప తలను ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసినట్టు విచారణలో తేలింది. ఇలాంటి నమ్మకాలతో పాతబస్తీలోని బాబాలను ఆశ్రయించే అమాయకుల సంఖ్య ఎక్కువే. ఓవైపు జనమంతా టెక్నాలజీలో దూసుకెళ్తుంటే... మరోవైపు గుడ్డి నమ్మకాలతో చివరికిలా దారుణాలకు పాల్పడుతుండటం సమాజాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య. అందుకే జనాలకు అవగాహన కల్పించేందుకు జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మేం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని ఓ సంస్థ ఎన్నని చేయగలదు? ఓ బాబాకు డబ్బులు ఇచ్చినట్టుగా మాలాంటి సంస్థలకు ఎవరూ ఇవ్వరు కదా? మేం మాత్రం ఎన్నని చేయగలం. చదువుకున్నవాళ్లు కూడా ఇలాంటి నమ్మకాలను పాటిస్తుంటే... వారి వల్ల మేం ఎన్ని కార్యక్రమాలు చేసినా వృథానే. అసలు మాలాంటి వాళ్లకు ప్రోత్సాహమే లేదు. మూఢనమ్మకాల పేరుతో దోచుకునేవాళ్లకే ప్రాత్సాహం ఉంది. ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నంతకాలం సమాజంలో మార్పు రాదు.
న్యూస్ 18 తెలుగుతో... టీవీ రావు, జన విజ్ఞాన వేదిక జాతీయ సలహాదారు


ఏ హాని చేయని ఏ నమ్మకాన్ని పాటించినా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ గుడ్డి నమ్మకాలతో ఇలా ప్రాణాలు తీస్తుండటం సమాజాన్ని కలవరపరుస్తున్న పెద్ద సవాల్. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా మూఢనమ్మకాలపై జనానికి చైతన్యం కల్పిస్తే తప్ప ఇలాంటి దారుణాలు ఆగవు.
Published by: Santhosh Kumar S
First published: August 8, 2018, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading