news18-telugu
Updated: July 27, 2020, 10:35 PM IST
నెల్లూరులో క్షుద్రపూజల కలకలం
చంద్రుడి మీదకు రాకెట్లు పంపుతున్న ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు జడలు విప్పుతున్నాయి. చేతబడి, క్షుద్రపూజల పేరుతో కొందరు వ్యక్తులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఉదయగిరి పట్టణంలోని కావలి మార్గంలో ఉన్న అటవీ శాఖ ప్లాంటేషన్లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు స్త్రీ ఆకారంలో ముగ్గు వేశారు. ముగ్గు మధ్య భాగంలో ఓ యువతి పాస్పోర్టు సైజ్ ఫొటో ఉంచి పూజలు చేశారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, టెంకాయలు, గుమ్మడికాయ, సాంబ్రాణి కడ్డీలతో ఏవేవో పూజలు నిర్వహించారు.
ఇవాళ అడవిలో మేకలను మేపేందుకు వెళ్లిన కొందరు కాపరులకు ఈ దృశ్యాలు కనిపించాయి. వెంటనే స్థానిక జేవీవీ నాయకులకు సమాచారం అందించడంతో వారు అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకు ఎవరో కావాలనే ఇలా చేశారని చెప్పి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందింది. వారు కూడా వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీని వెనక ఎవరున్నారు? ఆ ముగ్గులో ఉన్న ఫొటో ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఐతే స్త్రీ ఆకారంలో ముగ్గు వేయడం, అందులో ఓ యువతి ఫొటో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
Published by:
Shiva Kumar Addula
First published:
July 27, 2020, 3:54 PM IST