తెలంగాణలో బీజేపీ నేత దారుణ హత్య.. ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతను కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు.

 • Share this:
  తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతను కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. వైరాకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రామారావు ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. బైక్‌పై హెల్మెట్స్ ధరించి వచ్చిన వారు.. ఇంట్లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే రామారావుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్న రామారావు కుటుంబ సభ్యులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన రామరావును కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రామారావు చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారు. మరోవైపు రామారావుపై దాడి చేసిన నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు

  ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రామారావు మృతదేహానికి వైద్యులు పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నారు. రామారావు మరణవార్త తెలుసుకున్న ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇక, రామారావుపై దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు మాడపాటి రాజేశ్ మధిర కోర్టులో లొంగిపోయాడు.

  ఇక, రాష్ట్రంలో కేబుల్ వ్యవస్థ నిర్వాహకులు జీఎస్టీ కట్టడం లేదు అని, దాదాపు వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అని RTI ద్వారా తీసుకున్న సమాచారంతో రామారావు హైకోర్టులో కేసు వేశారు. ఈ విషయంలో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ నాయకుల నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇటీవల పార్టీ పెద్దలకు చెప్పుకున్నట్టుగా సమాచారం.
  Published by:Sumanth Kanukula
  First published: