Telangana: తగులబెట్టిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం.. వివాహేతర సంబంధమే కారణమా..?.. అతని భార్య ఏం చెప్పిందంటే..

తగులబెట్టిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం(image-ANI)

తెలంగాణ మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తగలపెట్టిన కారు డిక్కీలో శవం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

 • Share this:
  తెలంగాణ మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తగలపెట్టిన కారు డిక్కీలో శవం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆ శవం కూడా కారు యజమానిదే కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారు డిక్కీలో ఉన్న మృతదేహాన్ని.. స్థానిక బీజేపీ నేత ధర్మాకర్ శ్రీనివాస్‌దిగా గుర్తించారు. అతడిని హత్య చేసిన అనంతరం కారు డిక్కీలో ఉంచి.. కాల్చివేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. సోమవారం రాత్రి సమయంలో వెల్దుర్తి-నర్సాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న మంగళపర్తి గ్రామ శివారులో కారు తగలబడుతున్న దృశ్యాలను ఓ ఆటో డ్రైవర్ చూశాడు. వాటిని తన ఫోన్‌లో రికార్డు చేసి.. వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేశాడు. అయితే ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్.. పోలీసులకు సమాచారం అందించాడు.

  దీంతో మంగళవారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. కారు డిక్కీలో మృతదేహం ఉండటం పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కారు నెంబర్ TS 15E 4005గా గుర్తించారు. అది మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్‌ శ్రీనివాస్‌(47)ది అని తేలింది. దీంతో పోలీసులు అతని ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శ్రీనివాస్ సోమవారం మధ్యామ్నం బయటకు వెళ్లినట్టుగా అతని భార్య హైందవి పోలీసులకు తెలిపారు. తర్వాత ఆయన సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే కలవలేదని చెప్పారు.

  మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు ఉన్న పెట్టుడు దంతాల ఆధారంగా కుటుంబ సభ్యులు.. అది అతడి మృతదేహం అనే నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్ భార్య హైందవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు శ్రీనివాస్‌కు స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లోనూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ధర్మాకర్ శ్రీనివాస్‌కు స్థానికంగా ఓ థియేటర్‌ ఉంది. ఆయన గతంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: