ఇక బీహార్‌లోని అనాథ శరణాలయాలు, షెల్టర్ హోమ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. కొంతకాలంగా బీహార్‌లోని షెల్టర్ హోమ్స్‌లో వరుసగా దారుణాలు బయటపడుతుండటం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీంతో షెల్టర్ హోమ్‌ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నట్టు తేలడంతో బీహార్‌లోని అన్ని షెల్టర్స్ని ప్రభుత్వమే నడపనుంది.
ఈ ఏడాది బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. నిధులు ఎలా వినియోగిస్తున్నారు? షెల్టర్ హోమ్స్‌లో సమస్యలేంటీ? అని ఆరా తీస్తే దారుణాల గురించి తెలిసింది. బాలికలనే కాదు... లైంగిక దోపిడీ, వెట్టిచాకిరీ బారినపడ్డ మహిళలతో పాటు అనాథ పిల్లల్నీ బాధితులుగా గుర్తించింది ప్రభుత్వం.

ఇలాంటివారిని రక్షించాల్సినవాళ్లే నేరస్తులుగా మారారు. అందుకే రెండుమూడు నెలల్లో రాష్ట్రంలోని అన్ని షెల్టర్లను స్వాధీనం చేసుకుంటాం.
— రాజ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్
బీహార్‌లోని షెల్టర్ హోమ్స్‌లో దారుణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అన్ని షెల్టర్ హోమ్స్‌ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయంపై పలువురి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆడిట్ చేసేందుకు చొరవ తీసుకోవడమే కాదు... చర్యలు కూడా తీసుకుంటోంది బీహార్ ప్రభుత్వం. చాలా అరుదుగా ఇలాంటి నివేదికలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటాయి. రాష్ట్ర అధికారులైతే షెల్టర్ నిర్వాహకులపై ఫిర్యాదులు కూడా చేశారు.
— మొహమ్మద్ తారీఖ్, కోషిష్ సంస్థ డైరెక్టర్
భారతదేశంలో 9,000 షెల్టర్లున్నాయి. అందులో 33 శాతమే ఆడిట్ జరిగింది. 2,30,000 మంది పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గతవారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. 1300 షెల్టర్లు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని ఆ సంస్థ లెక్కతేల్చింది.