బీహార్‌లో వెలుగుచూసిన కోవిడ్ వ్యాక్సిన్ డేటా ఫ్రాడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. 8 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించామని బీహార్ ప్రభుత్వం వారం రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న 8 కోట్ల మందిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సోనియా గాంధీ, సినీ తార ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ కూడా ఉన్నారట. అదేంటి, వీరందరూ ప్రత్యేకించి బీహార్‌కే వచ్చి ఒకే చోట వ్యాక్సిన్ వేయించుకోవడమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ ప్రముఖులంతా నిజంగా బీహార్‌లో వ్యాక్సిన్ తీసుకోలేదు. అక్కడి కంప్యూటర్ నిర్వాహకుల డేటా ఫ్రాడ్ వల్ల ఈ అవకతవకలు జరిగాయి. బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో ఈ భారీ డేటా మోసం వెలుగులోకి వచ్చింది. మోదీ, ప్రియాంకలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు చూపించే ఈ జాబితా ఇప్పుడు కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. కార్పీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మోదీ, ప్రియాంక, తదితరులకు టీకాలు వేసినట్లు టీకా పోర్టల్‌లో అప్లోడ్ చేశారు అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లు. అయితే టీకా వేయించుకున్న వ్యక్తుల జాబితాలను ఇటీవల తనిఖీ చేస్తుండగా.. ఇందులో ఈ ప్రముఖుల పేర్లు కనిపించాయి. విస్తుగొలిపే అంశం ఏమిటంటే.. వీరు ఒకసారి కంటే ఎక్కువ సార్లు టీకా తీసుకున్నట్లు ఆ జాబితాలో కనిపించింది. ఈ భారీ మోసానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించింది.
డేటా మోసం ఎలా, ఎవరి ఆదేశాల మేరకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతుందని జిల్లా మేజిస్ట్రేట్ జె ప్రియదర్శిని తెలిపారు. "ఇది చాలా తీవ్రమైన విషయం. మేం టెస్టింగ్, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నాం. కానీ మరో పక్క ఇలాంటి అక్రమాలు జరుగుతుండటం బాధాకరం. కార్పీలోనే కాదు, మేం అన్ని హెల్త్ కేర్ సెంటర్లలోని జాబితాలను పరిశీలిస్తాం. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదయింది. మేం దీనిపై చర్యలు తీసుకుంటాం. ఒక ప్రమాణాన్ని సెట్ చేస్తాం." అని ఆమె వెల్లడించారు. ఇటీవల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. "ఇద్దరు ఆపరేటర్లను విధుల నుంచి తొలగించారు. అయితే ఇతరులను కూడా తప్పనిసరిగా విచారించాలని నేను అభిప్రాయపడుతున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు.
బీహార్ ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే కూడా ఈ వ్యవహారంపై మాట్లాడారు. ఈ విషయం తమ శాఖ ముందుకు వచ్చిన వెంటనే, డేటాని ఎంట్రీ చేసిన ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించారని ఆయన పేర్కొన్నారు. "నేను జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడాను. ఏ జాబితాలో కూడా మోసాలు లేవని నిర్ధారించేందుకు ఇతర ఆసుపత్రుల డేటాను కూడా పరిశీలించాలని నేను వారిని కోరాను. ఒకవేళ ఉంటే, బాధ్యులపై చట్ట ప్రకారం శిక్షలు విధిస్తాం. ఇలాంటి కేసులు మరిన్ని వెలుగులోకి వస్తే దీనిని చాలా సీరియస్‌గా పరిగణించి కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని మంగళ్ పాండే మీడియాతో అన్నారు.
పాట్నాలో డేటా మోసానికి సంబంధించిన మరొక ఉదాహరణను కూడా ఆరోగ్య మంత్రి లేవనెత్తారు. రెండో టీకా డోసు తీసుకోని వ్యక్తులు టీకా కేంద్రాలకు వెళితే.. మీరు ఆల్రెడీ సెకండ్ డోస్ కూడా తీసుకున్నారని చెబుతూ వారిని ఇంటికి పంపించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇవి సాంకేతిక అంశాలు అని, ఈ వ్యవస్థలో లోపాలకు మేం ఆస్కారం ఇవ్వలేమని, మీరు తప్పు చేస్తే, మీరు కఠిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఇలాంటి తప్పుడు పేర్లతో టీకాలు తీసుకున్నట్లు జాబితా క్రియేట్ చేయడం వల్ల నిజంగా ఎంత మంది ప్రజలు టీకా తీసుకున్నారనే సంఖ్య మారొచ్చు. కాబట్టి ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Coronavirus, Covid, COVID-19 vaccine, Pm modi, Priyanka Chopra