విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది కూడా జనావాసాల మధ్య ఓ ఇంట్లోనుంచి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక ఆహాకారాలు చేశారు. ఇళ్లు, ఫ్లాట్లు వదిలి రోడ్డుపైకి పరుగులు తీశారు. మంటలు ఎందుకు వస్తున్నాయో తెలియక ప్రాణాల గుప్పిట పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.
విశాఖలోని స్థానిక 27వ వార్డులోని దొండపర్తి సమీపంలోని పాలికలవారి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండో అంతస్తులో నివాసం ఉంటున్న కె వెంకటేశ్వరరావు ఉదయం కుటుంబంతో కలిసి బయటికి వెళ్లారు. అయితే వారి అలా బయటకు వెళ్లిన కాసేపటి తరువాత ఇంట్లోంచి ఒక్కసారిగా దట్టమైన పొగ బయటకు వచ్చింది. వెంటనే ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు, అగ్నిమాక సిబ్బంది అగ్నిమాపక వాహనంతో అక్కడికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు శ్రమించారు. దీంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. పదిహేను లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఆ సమయంలో ఎవరైనా ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉండేది.
విశాఖపట్నంలో ఆ ఇంటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక అంతస్థు మొత్తం చెక్కతో.. చక్కని ఇంటీరియర్ తో అందంగా నిర్మించినట్టు తెలుస్తోంది. అలా పై అంతస్థు మొత్తం చెక్కతో ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. క్షణాల్లో వుడ్ అంతా కాలి బూడిద అయ్యింది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఓ అంతస్థు మొత్తం చెక్కతో చేయడానికి తోడు మంచి ఇంటీరియర్ డిజైనర్ కూడా అందంగా ఉండడంతో ఇక్కడ పలు సినిమాలు, సీరియల్స్ షూటింగ్ లు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడ చాలా షూటింగ్ జరిగాయని.. నగరంలో ఎక్కడ షూటింగ్ లు ఉన్నా.. మేకప్ అది ఈ ఇంట్లోనే వేస్తారని చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam, Vizag