ఒడిశా: గజపతి జిల్లాలో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిగా పనిచేసి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యరంజన్ మహోపాత్ర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పరలఖేముండి నుంచి నలుగురితో కూడిన పోలీసు బృందం ఈ కేసులో సౌమ్యరంజన్ భార్య భారతిని విచారించేందుకు మయూర్బంజ్ జిల్లాకు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను విచారించారు. జులై 12న సౌమ్యరంజన్ పరలఖేముండిలోని ఆయన అధికారిక క్వార్టర్ట్స్‌లో అనుమానాస్పద స్థితిలో తీవ్రమైన కాలిన గాయాలతో పడి ఉండటం కలకలం రేపింది. ఆయనను చికిత్స నిమిత్తం కటక్‌లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
సౌమ్యరంజన్కు భారతితో గతేడాది డిసెంబర్లో వివాహమైంది. ఫారెస్ట్ అధికారి సౌమ్య రంజన్ తండ్రి తన కుమారుడిని పక్కా ప్లాన్‌తో చంపేశారని.. భార్యతో పాటే ఉన్న భర్త 90 శాతం కాలిన గాయాలతో చనిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తన కోడలే కొందరి సహకారంతో భర్తను చంపేసిందని సౌమ్యరంజన్ తండ్రి ఆరోపిస్తున్నారు. పరలఖేముండి డీఎఫ్‌వో కేసరి బెహరా, వంట మనిషి మన్మథ్ కంబా సాయంతో తన కోడలే భర్తను చంపిందని పోలీసులకు సౌమ్యరంజన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు సౌమ్యరంజన్ భార్యతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
అయితే.. ఈ హత్య జరిగి దాదాపు నెల కావస్తున్నప్పటికీ ఇప్పటికీ నిందితులు ఎవరనే విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవడం గమనార్హం. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సౌమ్యరంజన్ సోదరుడు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా హత్య జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఈ కేసులో మిస్టరీని చేధించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. విచారణలో సౌమ్యరంజన్ భార్య భారతి సంచలన విషయాలను బయటపెట్టారు. తన భర్తకు వేరెవరితోనో వివాహేతర సంబంధం ఉందని.. వాట్సాప్ చాట్‌లో ‘ఐ లవ్ యూ’ అని ఒక నంబర్‌కు పంపారని ఆమె ఆరోపించింది.
‘ఒకరోజు నేను ఆయన ఫోన్‌కు ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ రావడం గమనించాను. ఇయర్‌ఫోన్ పెట్టుకుని ఆయన మాట్లాడారు. ఆ ఫోన్ కాల్లో ఒక మహిళ గొంతును గమనించాను. ఒకసారి సౌమ్యరంజన్ ఎవరో మహిళకు ‘ఐ లవ్ యూ’ అని వాట్సాప్‌లో పంపారు. నేను ఈ విషయాన్ని గమనించడంతో.. ఫోన్ పాస్‌వర్డ్‌ను తరచూ మార్చేవారు. అంతేకాదు.. కాల్ హిస్టరీని, చాట్‌ను, ఫేస్బుక్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశాడు’ అని పోలీసుల విచారణలో సౌమ్యరంజన్ భార్య బయటపెట్టింది. ఇలా ఈ కేసు ప్రస్తుతానికి మిస్టరీగానే మిగిలినప్పటికీ త్వరలోనే ఈ అనుమానాస్పద మృతి వెనకున్న మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో ప్రస్తుతం ఈ కేసు మిస్టరీ చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband, Odisha, Odisha news, Wife