కాలేజీ విద్యార్థినులకు ఘోర అవమానం...జాతీయ మహిళా కమిషన్ సీరియస్

గుజరాత్‌లోని ఓ కాలేజీలో దారుణం జరిగింది. పీరియడ్స్ సమయంలో కొందరు విద్యార్థినులు క్యాంపస్‌లోని కాలేజీలోకి ప్రవేశిస్తున్నారంటూ కాలేజీ ప్రిన్సిపల్ 68 మంది విద్యార్థినులను బాత్‌రూంకు తీసుకెళ్లి వారి లోదుస్తులు విప్పించి పరిశీలించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

news18-telugu
Updated: February 15, 2020, 8:56 AM IST
కాలేజీ విద్యార్థినులకు ఘోర అవమానం...జాతీయ మహిళా కమిషన్ సీరియస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో  ఆడవారిలో రుతుక్రమం గురించి మాట్లాడుకోవడాన్ని చాలా మంది తప్పుగా చూస్తుంటారు. శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. ఆ సమయంలో అమ్మాయిలను అంటరాని వారిగా భావిస్తుంటారు. ఐతే సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. బ్లీడింగ్ గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. పీరియడ్స్ పట్ల అమ్మాయిలు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు వస్తున్న క్రమంలో గుజరాత్‌లోని ఓ కాలేజీ యాజమాన్యం అమ్మాయిల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించింది. పీరియడ్‌లో ఉన్నవారిని గుర్తించేందుకు 68 మంది విద్యార్థినులకు లోదుస్తులను విప్పించారు. భుజ్‌లోని శ్రీ సహజానంద్ గర్ల్స్ కాలేజీలో ఈ దారుణం జరిగింది.

భుజ్‌లో స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్‌ అండ్‌ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌‌ నడుస్తోంది. దాదాపు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులే ఉన్నారు. భారతీయ సాంప్రదాయాలు అనే పునాదులపై ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆచారాలు, నియమాలు, సంప్రదాయ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ నియమాల ప్రకారం.. నెలసరి (పీరియడ్స్) సమయంలో విద్యార్థినులు కిచెన్‌తో పాటు క్యాంపస్‌లోని ఆలయంలోకి ప్రవేశించకూడదు. తోటి విద్యార్థులను సైతం తాకకూడదు. ఐతే ఈ రూల్స్‌ని కొందరు అమ్మాయిులు బ్రేక్ చేస్తున్నారంటూ ఇటీవల కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదులు అందాయి. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు కిచెన్‌లోకి వెళ్తున్నారని తెలిసింది.

ఈ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ అత్యంత దుర్మార్గపు నిర్ణయం తీసుకుంది. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు వాళ్ల లో దుస్తులను విప్పించింది. తరగతి గదిలో ఉన్న 68 మంది విద్యార్థులను బయటకు పిలిపించి..అందరినీ వాష్‌ రూమ్‌కి తీసుకెళ్లారు. ఒక వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరినీ లో దుస్తులు తొలగించి నెలసరిలో ఉన్నారో లేదో పరిశీలించారు. ప్రిన్సిపల్ సమక్షంలోనే ఈ తతంగమంతా జరిగింది. ఇద్దరు విద్యార్థులు తాము నెలసరిలో ఉన్నామంటూ పక్కకు తప్పుకున్నారు. వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్.. ఇష్టానుసారం దుర్బాషలాడారు. ఈ సందర్భంగా కొందరు లో దుస్తులు తీసేందుకు నిరాకరించగా...వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రిన్సిపల్ బెదిరించినట్లు తెలుస్తోంది.కాలేజీ యాజమాన్యం తీరును విద్యార్థినులు తీవ్రంగా తప్పుబట్టుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్స్ విషయంలో కాలేజీ లెక్చరర్లు, వార్డెన్లు, ప్రిన్సిపాల్ తమను చాలా సార్లు వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తీరుపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. అమ్మాయిల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన తప్పును అంగీకరించిన ప్రిన్సిపల్, దీని పట్ల క్షమాపణ చెప్పారు.

మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కాలేజీ యాజమాన్యం తీరును జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. నిజానిజాలు తేల్చేందుకు నిజనిజర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ కమిటీ కాలేజీలో పర్యటించి బాధిత విద్యార్థులతో మాట్లాడనుంది. అటు గుజరాత్ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఘటనపై క్రాంతిగురు శ్యామ్‌జీ క్రిష్ణవర్మ కచ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఓ కమిటీని నియమించి విచారణకు ఆదేశించారు.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు