సైబర్ నేరగాళ్ల రోజుకో కొత్త రకం మోసంతో రెచ్చిపోతున్నారు. సామాన్య జనాలనే కాకుండా ప్రముఖలను కూడా వారి బుట్టలో వేసుకుని అందిన కాడికి దోచేస్తున్నారు. అందుకోసం ఒక్కోక్కరికి ఒక్కో ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు వెంకీ కుడుముల సైబర్ నేరగాళ్ల బాధితుడిగా మారాడు. సైబర్ నేరగాడు చెప్పిన మాటలు నిజం అని నమ్మి రూ. 66 వేలు సమర్పించుకున్నాడు. వివరాలు.. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుములు భీష్మ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవల దర్శకుడు వెంకీకి ఫోన్ చేసిన ఓ కేటుగాడు.. తాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్ సభ్యుడినని చెప్పారు. తాను భీష్మ చిత్రం చూశానని.. చాలా బాగుందని చెప్పాడు.
ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నామినేట్ చేయాలంటే ఒక్కో కేటగిరికి రూ. 11 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే ఇది నమ్మిన దర్శకుడు వెంకీ.. మొత్తం ఆరు కేటగిరిలకు కలిసి రూ. 66 వేలు సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాకు పంపాడు. ఇక, ఆ తర్వాత వెంకీ కుడుములకు మళ్లీ ఫోన్ చేసిన సైబర్ నేరగాడు.. మరోసారి మోసం చేసేందుకు యత్నించాడు. ఆరు కేటగిరీలు నామినేట్ చేసే విషయంలో మూడు కేటగిరిల విషయంలో పొరపాటు జరిగింది.. దానిని సరి చేయడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు.
అయితే అతడి మాటలపై అనుమానం రావడంతో.. వెంకీ కుడుముల అప్రమత్తమయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే నిందితుడు కాల్ చేసిన ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను పోలీసులకు అందజేశారు. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, CYBER CRIME, Tollywood, Venky Kudumula