BEWARE OF THIS NEW WHATSAPP SCAM PROVIDING ANY INFORMATION IS DANGEROUS AS IT CAN LEAD TO THE LOSS OF YOUR PERSONAL DATA GH SRD
WhatsApp Scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసాలు..మీరు అలా చేశారంటే ఇక అంతే సంగతులు..
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Scam: టెక్నాలజీకి ఎంతగా అడిక్ట్ అవుతున్నామో..అంత త్వరగానే మాయగాళ్ల బారిన పడుతున్నాం. రోజుకో మోసంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అమాయకుల్ని టార్గెట్ చేసుకుని డబ్బులు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు.
ఒకప్పుడు హ్యాకింగ్ ద్వారా అక్రమంగా డబ్బు కొల్లగొట్టిన సైబర్ నేరస్థులు.. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా సులభంగా అమాయకులను మోసం చేస్తున్నారు. నకిలీ లింకులను పంపిస్తూ, వాటి ద్వారా సున్నితమైన సమాచారాన్ని పొందుతున్నారు. అనంతరం బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ చేసుకుంటున్నారు. లేదంటే యూజర్ల డేటాను కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారు. తాజాగా అమెజాన్ వార్షికోత్సవం పేరుతో సైబర్ నేరస్థులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఉచిత బహుమతులు పొందవచ్చని అమాయకులను నమ్మిస్తారు. ఇందుకు ఒక సర్వేలో పాల్గొనాలని.. వాట్సాప్‌లో లింక్ పంపిస్తారు. ఆ తరువాత అసలు పని మొదలుపెడతారు. వినియోగదారులు ఆ వాట్సాప్ మెస్సేజ్‌పై క్లిక్ చేసినప్పుడు, కొత్త విండో తెరుచుకుంటుంది. ‘అభినందనలు.. మీరు మా సర్వేలో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఇందుకు ఒక నిమిషం మాత్రమే పడుతుంది. సర్వే తరువాత మీకు అద్భుతమైన బహుమతి లభిస్తుంది. హువావే మేట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను మీరు గెలుచుకుంటారు’ అనే మెస్సేజ్ డిస్ప్లే అవుతుంది. సేవలను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే ప్రశ్నలకు సర్వేలో సమాధానం ఇవ్వాలని వినియోగదారులను అడుగుతారు. వయస్సు, లింగం, అమెజాన్ అందించే సేవల నాణ్యత, వినియోగదారులు ఏ రకమైన ఫోన్ (ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్) వాడుతున్నారు.. అనే ప్రశ్నలు ఉంటాయి.
కస్టమర్లు సమాధానాలను సబ్మిట్ చేసిన తర్వాత, స్క్రీన్‌పై కొన్ని గిఫ్ట్ బాక్సుల ఇమేజ్‌లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంచుకోవాలని చెబుతారు. ఈ లింకును ఐదు వాట్సాప్ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులతో షేర్ చేయాలని ఈ నకిలీ వెబ్సైట్ అడుగుతుంది. అనంతరం ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసి, అందులో చిరునామాను నమోదు చేయమని చెబుతుంది. కస్టమర్లు గెల్చుకున్న బహుమతిని, వారి చిరునామాకు వారం రోజుల్లోపు పంపిస్తామని నోటిఫికేషన్ వస్తుంది.
ఇలాంటి నకిలీ వెబ్సైట్లతో కస్టమర్ల డేటాను సేకరించి, దాని ద్వారా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. యూజర్ల డివైజ్‌లో మాల్వేర్ను ఇన్స్టాల్ చేయడానికి సైతం హ్యాకర్లు ఈ లింక్‌లను ఉపయోగించవచ్చు. ఇది డేటా చౌర్యం, ఆర్థిక మోసానికి దారితీస్తుంది. అందువల్ల వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా పంపే లింకుల నుంచి ఎలాంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
వాట్సాప్‌లో సర్క్యులేట్ అయ్యే లింకులను నిశితంగా గమనించడం ద్వారా.. అది నిజమైనదో కాదో తెలుసుకోవచ్చు. లింక్ అడ్రస్ ఒరిజినల్ URLను పోలి ఉండేలా స్కామర్లు తయారుచేస్తారు. అనవసరమైన అక్షరాలు, పదాలు దాంట్లో ఉంటాయి. అయితే URLతో సబంధం లేకుండా, తెలియని ఫోన్ నంబర్ నుంచి వచ్చిన లింక్‌పై క్లిక్ చేయకపోవడం మంచిది. కొందరు అనవసరంగా వీటిని గ్రూప్‌లలో షేర్ చేస్తారు. దీనివల్ల ఇతరులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలాంటి నకిలీ మెస్సేజ్‌లు, ఫేక్ వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.