KYC Update : కేవైసీ అప్‌డేట్ మోసాలపై జాగ్రత్త వహించండి

సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. వినియోగదారులను సులభంగా మోసం చేసేందుకు కేవైసీ అప్‌డేట్‌ను అస్త్రంగా ఎంచుకుంటున్నారు.

news18-telugu
Updated: September 11, 2020, 1:43 PM IST
KYC Update : కేవైసీ అప్‌డేట్ మోసాలపై జాగ్రత్త వహించండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. వినియోగదారులను సులభంగా మోసం చేసేందుకు కేవైసీ అప్‌డేట్‌ను అస్త్రంగా ఎంచుకుంటున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువైనట్టు పోలీసులు చెబుతున్నారు. టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్, ఎనీడెస్క్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని, వాటి నుంచి పేటీఎం కైవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు వినియోగదారులను నమ్మిస్తున్నారు. వాటిని ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్న తరువాత వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని సేకరించి డబ్బు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్ల మాయమాటలు నమ్మి లక్షల రూపాయలు కోల్పోయినవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అవగాహన పెంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా నమోదైన ఇలాంటి కేసు గురించి ప్రజలకు వివరించారు.

సెప్టెంబరు 2న హైదరాబాద్‌లో నమోదైన ఓ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. రాధిక (పేరు మార్చారు) అనే యువతి పేటీఎం కేవైసీ పేరుతో మోసపోయినట్టు పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల ఒకటో తేదీన పేటీఎం కేవైసీని పునరుద్ధరించుకోవాలని వినయ్ శర్మ అనే వ్యక్తి ఆమెకు కాల్ చేశాడు. ఇందుకోసం ఫోన్‌లో క్విక్ సపోర్ట్ యాప్ ఇన్స్టాల్ చేయమని సూచించాడు. ఆ యాప్ ద్వారా మోసగాడు కొన్ని మెసేజ్‌లు పంపించాడు. కాల్ మాట్లాడుతుండగానే... పేటీఎమ్ లో లాగిన్ అయ్యి ఆమె డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల సమాచారాన్ని పొందుపరచాలని సూచించాడు. అలా చేసిన తరువాత ఒక రూపాయిని తాను చెప్పే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాడు. ఆ వ్యక్తి సూచనలను అనుసరించిన రాధిక బ్యాంకు అకౌంట్, కార్డుల సమాచారాన్ని అప్‌డేట్ చేసింది. అనంతరం ఒక రూపాయి ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం కొన్ని క్షణాల్లోనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ కార్డు ద్వారా రూ.1,46,747, క్రెడిట్ కార్డు ద్వారా రూ.2,82,613 విత్‌డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన రాధిక పోలీసులను ఆశ్రయించింది. పేటీఎం కేవైసీ పేరుతో తాను రూ.4,29,360 మోసపోయినట్టు, ఇందుక కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

కాగా, కొన్ని రోజుల నుంచి మోసగాళ్ళు పేటీఎం ఖాతాదారులను మెసేజ్‌లు లేదా కాల్స్ ద్వారా సంప్రదించి, వారి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని చెబుతున్నారు. అలా చేయకపోతే తమ పేటీఎం ఖాతా బ్లాక్ అవుతుందని నమ్మిస్తున్నారు. అనంతరం ఏదో ఒక థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసి, ఒక రూపాయి బదిలీ చేయమని అడుగుతారు. ఆ తరువాత వారి ఖాతా నుండి డబ్బు లాగుతారు.
-ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు.
- పేటీఎం వంటి పేమెంట్ యాప్‌ల కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోమని వచ్చే మెసేజ్‌లు, ఫోన్లను నమ్మకూడదు.
- బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు.
-అన్ ఆథరైజ్డ్ థర్డ్ పార్టీ యాప్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయకూడదు. వాటిలో ఖాతాలు, కార్డుల సమాచారాన్ని పొందుపరచొద్దు.-గుర్తింపు లేని యాప్ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయకూడదు.
- మీకు తెలియకుండానే మీరు డౌన్లోడ్ చేసే యాప్ల ద్వారా మీ ఖాతా వివరాలను మోసగాళ్ళు యాక్సెస్ చేయవచ్చు. దీంతో మీరు మోసపోవచ్చు.
Published by: Narsimha Badhini
First published: September 11, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading