తల్లిని చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి అండమాన్‌ టూర్

అమృత, శ్రీధర్ రావు

అమృత దాడిలో తల్లి చనిపోగా.. తమ్ముడు మాత్రం బతికే ఉన్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడు బంధువులు, పోలీసులకు ఫోన్ చేసి జరిగిన దానిని వివరించాడు.

 • Share this:
  కన్నతల్లినే అతి కిరాతకంగా హత్య చేసిందో కూతురు. కత్తితో కసిదీరా పొడిచి చంపి.. అనంతరం ప్రియుడితో కలిసి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనకు వెళ్లింది. ఐటీ సిటీ బెంగళూరులో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమృత (33) ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 2017 వరకు రెగ్యులర్‌గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం అమృత భారీగా అప్పుచేసింది. 2013లో రూ.4లక్షలు అప్పు చేస్తే.. వడ్డీతో కలిపి ఇప్పుడది రూ.8లక్షలకు చేరింది. ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోవడంతో.. తల్లీ,తమ్ముడిని చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది అమృత.

  తాను అనుకున్నట్లుగానే ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. ఫిబ్రవరి 2 తెల్లవారుజామున తల్లి నిర్మలను చాకుతో పొడిచింది. ఆమె అరుపులతో నిద్రలేచి వచ్చిన తమ్ముడిపైనా దాడి చేసింది. ఇద్దరు చనిపోయారని భావించి అమృత తన బ్యాగ్‌తో బయటకు వెళ్లిపోయింది. అప్పటికే ఇంటి బయట బైక్‌పై సిద్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్ రావుతో కలిసి నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న టికెట్లతో ఇద్దరూ కలిసి బెంగళూరు నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లారు. ఐతే అమృత దాడిలో తల్లి చనిపోగా.. తమ్ముడు మాత్రం బతికే ఉన్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడు బంధువులు, పోలీసులకు ఫోన్ చేసి జరిగిన దానిని వివరించాడు.

  మూడు రోజులుగా అమృత కోసం గాలిస్తున్న పోలీసులు.. ఆమె అండమాన్‌లో ఉందని తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్లారు. బుధవారం ప్రియుడితో పాటు ఆమెనూ అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. అండమాన్ ట్రిప్‌ను అమృత ఐదు రోజుల ప్లాన్ చేసుకుంది. అనంతరం సూసైడ్ చేసుకోవాలనుకుంది. కానీ అంతకంటే ముందే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఐతే అమృత తల్లిని చంపిన విషయం ఆమె ప్రియుడు శ్రీధర్ రావుకు తెలిసినట్లు లేదని తెలిపారు. మరి అమృత నిజంగా ఆర్థిక కారణాల వల్లే తల్లిని చంపిందా? లేదంటే మానసిక సమస్యలేమైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: