• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • BENGALURU INFANT KIDNAP MYSTERY SOLVED BY POLICE AND ACCUSED IDENTIFIED AS DR RASHMI SHASHIKUMAR HERE THE FULL DETAILS GH SRD

నవజాత శిశువు కిడ్నాప్ కేసు..ఇదో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్..దీని వెనుక ఎవరు ఉన్నారో తెలిసి షాకైన పోలీసులు..

ప్రతీకాత్మక చిత్రం

ఈ కేసును పరిష్కరించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఎస్ఐ కే.ఆర్. శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందం నిరంతర కృషితో నిందితురాలిని గుర్తించగలిగారు. అనుమానితులను పట్టుకోవడానికి ఈ బృందం సమీప టవర్ నుంచి 30,000 ఫోన్ కాల్స్ విశ్లేషించింది.

  • Share this:
పెద్ద ముఠాలకు చెందిన కొందరు నేరస్తులు.. అప్పుడే పుట్టిన చిన్నారులను తల్లినుంచి వేరుచేసి అమ్ముకునే ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. కానీ సమాజంలో పెద్దమనిషిగా చలామని అవుతున్న ఒక యువ వైద్యురాలు ఇలాంటి పని చేసింది. ఒక సంవత్సరం క్రితం.. ఒక రోజు వయసున్న బాబును తల్లి నుంచి దొంగిలించి, పిల్లలు లేని దంపతులకు ఆమె అమ్ముకుంది. ప్రముఖ హాస్పిటల్‌లో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న ఆ డాక్టరు ఇలాంటి పని చేసిందని తెలిసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. బెంగళూరులోని చమరాజ్‌పేటలో ఉన్న BBMP ప్రసూతి వైద్యశాల నుంచి నవజాత శిశువును దొంగిలించిందనే ఆరోపణలతో 34 ఏళ్ల సైకియాట్రిస్ట్‌ రష్మి శిశికుమార్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చిన్నారిని ఆమె భారీ మొత్తానికి అమ్మినట్లు వారు గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ రష్మి శశికుమార్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె బెంగళూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ కేసును పరిష్కరించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఎస్ఐ కే.ఆర్. శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందం నిరంతర కృషితో నిందితురాలిని గుర్తించగలిగారు. అనుమానితులను పట్టుకోవడానికి ఈ బృందం సమీప టవర్ నుంచి 30,000 ఫోన్ కాల్స్ విశ్లేషించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బెంగళూరు సౌత్‌ డీసీపీ హరీష్ పాండే వెల్లడించారు.

సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రష్మి.. అనుపమ అనే మహిళకు బీబీఎంపీ హాస్పిటల్ నుంచి దొంగిలించిన బాబును అమ్మింది. ఇందుకు ఆమె రూ.15 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుపమకు అంతకు ముందు మానసిక వైకల్యం ఉన్న ఒక పాప ఉంది. పాపకు చికిత్స అందించడానికి అనుపమ దంపతులు డాక్టర్ రష్మిని ఆశ్రయించారు. అలా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. మరో సంతానం కోసం సరోగసీని ఆశ్రయించాలనుకున్న అనుపమ దంపతుల అవసరాన్ని రష్మి సొమ్ముచేసుకోవాలి అనుకుంది.తన భర్తకు వ్యాపారంలో నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీనికి తోడు చదువుకునే రోజుల్లో రష్మి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్‌ బకాయిలు, వడ్డీ ఎక్కువ అవుతోంది. దీంతో అనుపమ దంపతులకు సరోగేట్ మదర్‌ను ఏర్పాటు చేయించి, వారి నుంచి డబ్బు డిమాండ్ చేయాలనుకుంది. కానీ అనుకున్న సమయానికి సరోగేట్ మదర్ దొరకలేదు. అయినా కూడా సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని, 2020 మే 28 లోపు ప్రసవం అయ్యే అవకాశం ఉందని నమ్మించింది.

ఈ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. రష్మీ కొత్త ప్లాన్ వేసింది. హాస్పిటళ్లలో అప్పుడే ప్రసవమైన తల్లుల నుంచి బిడ్డలను దొంగిలించి, అనుపమ దంపతులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మూడు ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లి శిశువుల కోసం ఆరా తీసింది. ఆఖరికి బీబీఎంపీ హాస్పిటల్‌కు వెళ్లి.. కన్సల్టింగ్ డాక్టర్‌గా అక్కడి వాళ్లను నమ్మించింది. ఇదే సమయంలో అప్పుడే ప్రసవించిన హుస్నా బాను అనే మహిళను గుర్తించింది. ఎవరూ లేని సమయంలో.. తల్లికి మత్తుమందు ఇచ్చి, ఒక రోజు వయసు మాత్రమే ఉన్న బాబును అక్కడి నుంచి తీసుకెళ్లింది. సరోగసి ద్వారా పుట్టిన బాబు అని చెప్పి.. అనుపమ దంపతులను నమ్మించింది. అయితే ప్రసవ సమయంలో కొన్ని సమస్యల కారణంగా దాని తల్లి మరణించిందని వారికి చెప్పింది.

బాబు అసలు తల్లిదండ్రులైన నవీద్ పాషా, హుస్నా బాను దంపతులు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు వలస వచ్చారు. కనిపించకుండా పోయిన బాబు గురించి కొన్నాళ్లు వెతికి, ఆశలు వదిలేసుకున్నారు. అయితే బీబీఎంపీ ఆసుపత్రిలో శిశువు కనిపించకుండా పోయిన వార్త అప్పట్లో సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. హాస్పిటల్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లో.. నిందితురాలు బాబును తీసుకెళ్తున్న దృష్యాలు రికార్డ్ అయ్యియి. కానీ వీడియోలో సరిగా కనిపించలేదు. దీంతో పోలీసులు నిపుణుల సాయంతో స్కెచ్ వేయించారు. దీని ఆధారంగా దర్యాప్తు చేసినా, ఉపయోగం లేకుండా పోయింది.

* కేసు కోసం ప్రత్యేక బృందం
ఈ కేసును పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా 20 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించడం దగ్గరి నుంచి దగ్గర్లో ఉన్న టవర్ల పరిధిలో రికార్డ్ అయిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించడం వరకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. మొత్తం 35,000 ఫోన్ నంబర్లను ఈ బృందం విశ్లేషించింది. కొన్ని వారాల పరిశోధన తరువాత, ఇందులో 600 ఫోన్ నంబర్లను అనుమానితుల జాబితాలో చేర్చారు.వీరందరి ఫోటోలను, ఘటన జరిగిన సమయంలో వారు ఎక్కడ ఉన్నారనే వివరాలను సేకరించారు. దీంతో పాటు వీరి ఫోటోలను పోలీసులు తయారు చేయించిన స్కెచ్‌తో పోల్చి చూశారు. ఇందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. ఆఖరికి రష్మి ఫోటోతో స్కెచ్‌ను పోల్చి చూసి.. ఆమే ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది.

కేసు దర్యాప్తులో భాగంగా, ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది నుంచి కార్మికుల వరకు ప్రతి ఒక్కరినీ ప్రత్యేక పోలీసుల బృందం విచారించింది. బీబీఎంపీ హాస్పిటల్‌తో సంబంధం ఉన్న సుమారు 800 మంది అనుమానితులను వీరు ప్రశ్నించారు. మొత్తానికి సంవత్సరం క్రితం తల్లి నుంచి వేరు చేసిన బాబును పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాలు ఏవీ బాబును పెంచుకుంటున్న అనుపమ దంపతులకు తెలియదని పోలీసులు తెలిపారు. బాబు DNA విశ్లేషణ పూర్తయిన తరువాత, తనను అసలు తల్లిదండ్రులకు అప్పగిస్తామని వివరించారు.
Published by:Sridhar Reddy
First published: