news18-telugu
Updated: July 20, 2020, 2:23 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తమ కూతురిని రేప్ చేసి చంపేశారని ఆరోపించినప్పటికీ.. పోస్టుమార్టంలో రిపోర్టు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఆమెపై రేప్ జరగలేదని నివేదికలో వెల్లడయింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని వైద్యులు తెలిపారు. శరీరంలో విషం లభించిందని.. విషం సేవించడం వల్లే చనిపోయిందని స్పష్టం చేశారు.
ఉత్తర దినజ్‌పూర్ జిల్లాలోని సోనార్పూర్ ప్రాంతంలో ఆదివారం 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి ఆమెను కిడ్నాప్ చేశారని.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే శవమై కనిపించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతదేహం ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నఓ చెట్టు కింద లభ్యమైంది. ఘటనా స్థలంలో విషం బాటిల్‌తో పాటు మొబైల్ ఫోన్ దొరికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరోవైపు మృతురాలికి ఫిరోజ్ అనే అబ్బాయితో పరిచయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. శనివారంలో అతడితో కలిసి తిరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఐతే బాలిక చనిపోయిన తర్వాత ఫిరోజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడిని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. బాలిక మరణించిన మరుసటి రోజే ఫిరోజ్ కూడా మరణించాడు. సోమవారం సోనార్‌పూర్‌లోని చెరువు వద్ద ఫిరోజ్ మృతదేహం లభ్యమైంది. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
బాలిక మృతితో పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ దినాజ్‌పూర్ జిల్లాతో పాటు చోట్ల ఆందోళనలు జరిగాయి. చోప్రా ప్రాంతంలో NH-31పై స్థానికులు రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఏబీవీపీ, డీవైఎఎఫ్ సహా పలు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఐతే పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Published by:
Shiva Kumar Addula
First published:
July 20, 2020, 2:18 PM IST