ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన డెంటల్ విద్యార్థిని లక్ష్మీలాలస అనుమానాస్పద మృతి కేసులో అనూహ్య కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన ఆమె నెల్లూరు జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతూ, మరికొద్ది రోజుల్లో కోర్సు పూర్తి చేయనుండగా పొంతనలేని కారణాన్ని పేర్కొంటూ బలవన్మరణానికి పాల్పడటం, అది ఆత్మహత్య కాదు హత్యే అని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది. లక్ష్మీలాలస మృతిపై కాలేజీ యాజమాన్యం వాదనకు భిన్నంగా మర్డర్ ఆరోపణలపై మరో ఫిర్యాదు దాఖలైంది. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
కడప జిల్లాలోని ఎర్రగుంట్లకు చెందిన ఎర్రంరెడ్డి లక్ష్మీలాలస(21).. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు గ్రామీణ మండల పరిధిలోని నారాయణ డెంటల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం విద్యార్థిని. కాలేజీ క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటోన్న ఆమె అనుమానాస్పదరీతిలో మరణించిందినే సమాచారం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాలేజీవారు చెప్పిన వెర్షన్ ప్రకారం..
బీడీఎస్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ లక్ష్మీలాలస పరీక్షల ఒత్తిడి కారణంగా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు వేలాడుతోన్న ఆమెను స్నేహితులు గుర్తించారు. కాలేజీ వాళ్లు చెబుతున్నదాన్ని బట్టి లక్ష్మీలాలస ఆత్మహత్య లేఖను కూడా రాశారు. ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల్లో పాస్ అవుతానన్న నమ్మకం లేదు. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మ, నాన్నా.. నన్ను క్షమించండి..’అని లేఖలో ఉన్నట్లు తెలిసింది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపి, సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే..
కూతురి మరణవార్త తెలిసిన వెంటనే లక్ష్మీలాలస తల్లిదండ్రులు కడప జిల్లా నుంచి నెల్లూరు చేరుకున్నారు. బిడ్డ ఎందుకు, ఎలా చనిపోయిందో కాలేజీ యాజమాన్యం చెబుతోన్న విషయాలను వారు నమ్మలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచీ చదువుల్లో రాణించి, బీడీఎస్ కూడా నాలుగేళ్లు విజయవంతంగా పూర్తి చేసి, తీరా ఇప్పుడు పరీక్షల ఒత్తిడితో చనిపోవడమేంటని వారు వాపోయారు. శనివారం రాత్రి నుంచి కాలేజీ క్యాంపస్ లో చోటుచేసుకున్న ఘటనలపై వారు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఉదంతం మరో మలుపు తిరిగినట్లయింది..
లక్ష్మీలాలస అనుమానాస్పద మృతిపై కాలేజీ యాజమాన్యం వాదనకు పూర్తి భిన్నంగా మృతురాలి తల్లిదండ్రులు నెల్లూరు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ముమ్మాటికీ లక్ష్మీలాలసను ఎవరో హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పేరెంట్స్ అంటున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పాప చనిపోతే.. ఆదివారం మధ్యాహ్నం దాకా ఆ విషయాన్ని దాచిపెట్టడమేంటి? హాస్టల్లో తోటి విద్యార్థినులంతా ఏమైపోయారు? విద్యార్థిని చినిపోయిందనే విషయాన్ని కాలేజీ యాజమాన్యం దాచడానికి వెనకున్న కారణాలేంటి? అని మృతురాలి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, College student, Nellore