మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర (Minister Srinivas goud murder plan) అంశం రాజకీయ మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో (Telangana politics) తీవ్ర చర్చలకు దారితీశాయి. ఎలాగైన ఈ ఆరోపణలను తిప్పికొట్టాలని, బీజేపీ నాయకులు అలాంటి వారు కాదని నిరూపించే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కొందరు ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘గత రెండ్రోజులుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర జరిగిందంటూ సీఎం కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డామిట్ కథ అడ్డం తిరిగినట్లుంది. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైంది' అని సంజయ్ అన్నారు.
చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి..
ప్రజలకు పోలీసులంటే గౌరవం లేకుండా పోతోందని, అలాంటి వారిని చూసి పోలీసు డిపార్టుమెంటు (Police Department) వారే ఛీ కొడుతున్నరని సంజయ్ అన్నారు. ప్రభుత్వాలు ఏవీ శాశ్వతం కాదు. పోలీసులు చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి. చట్టాన్ని ధిక్కరిస్తే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులే బలౌతారనే విషయాన్ని మర్చిపోకూడదని బండి సంజయ్ హితవు పలికారు.
మహిళా నేతకు, హత్య కేసుకు ముడిపెట్టి కథనాలా?
డీకే అరుణ (DK Aruna), జితేందర్ రెడ్డిల మీద వస్తున్న ఆరోపణలు, మీడియాలో వస్తున్న వార్తలపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీకే అరుణ మంత్రిగా పనిచేశారని, మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి పాటుపడ్డారని బండి సంజయ్ గుర్తుచేశారు. అలాంటి మహిళా నేతకు, హత్య కేసుకు ముడిపెట్టి కథనాలు రాయడం చాలా బాధ కలిగించిందని ఆయన చెప్పారు. జితేందర్ రెడ్డి కూడా సౌమ్యుడని, రెండు సార్లు ఎంపీగా చేశారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ వద్ద కూడా పనిచేశారని, మరి అప్పుడు ఎంత మంది హత్యకు కుట్ర చేశారో కేసీఆర్ (KCR) చెప్పాలంటూ బండి సవాల్ విసిరారు.
పోలీసులు వారి ఎఫ్ఐఆర్ లోగానీ, రిమాండ్ రిపోర్ట్ లో గానీ ఎక్కడా తమ నేతల వారి పేర్లు రాయలేదని, కానీ టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బండి. కేవలం బీజేపీని అప్రదిష్టపాలు చేయడానికి మాత్రమే సీఎం కేసీఆర్ డైరెక్షన్ (KCR Direction) లో పన్నిన కుట్ర ఇది అని స్పష్టంగా అర్ధమవుతోందని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కాపాడటం కోసం సీఎం ఒక తప్పు చేయబోయి.. తప్పు మీద తప్పు చేస్తున్నారని బండి విమర్శించారు.
వాడిని పట్టుకోవడానికే ఈ పోలీసులకు చేత కాలేదు..
నిర్మల్ (Nirmal) లో సాజిద్ ఖాన్ అనే టీఆర్ఎస్ లీడర్ 16 ఏళ్ల హిందూ బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి రెండు రోజులపాటు దారుణం చేస్తే వాడిని పట్టుకోవడానికే ఈ పోలీసులకు చేత కాలేదని బండి అన్నారు. వారం రోజులు పట్టిందని చెప్పారు. కానీ మంత్రిపై హత్యకు కుట్ర పన్నారంటూ వీళ్లను మాత్రం ఒక్కరోజులోనే ఢిల్లీపోయి పట్టుకొచ్చిండ్రని సంజయ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Murder attempt, Srinivas goud, Telangana