విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించరాదనే వివాదం ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతుండగా.. భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్యోద్యంతంతో కర్ణాటకలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శివమొగ్గ నగరంలో హర్ష అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు అతణ్ని కత్తులతో పొడిచి చంపారు. అతను భజరంగ్ దళ్ కార్యకర్త కావడంతో ఈ ఉదంతం రాజకీయ రచ్చకు దారితీసింది. ఘటన అనంతరం కోపోద్రిక్తులైన భజరంగ్ దళ్ కార్యకర్తలు శివమొగ్గ నగరంలోని సీగేహట్టి ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..
భజరంగ్ దళ్ కార్యకర్త హత్య ఘటనపై వాహనాలు తగులబెట్టిన నిరసనకారులు, నగరంలో భారీ ర్యాలీలు తీశారు. దీంతో శివమొగ్గలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. శివమొగ్గ నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, హత్య కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. కాగా, హిజాబ్ వివాదం కొనసాగింపుగానే ఈ ఘటన జరిగిందని హిందూ అతివాద సంఘాలు ఆరోపించగా, కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఆ కోణాన్ని కొట్టిపారేసింది.
శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు, హిజాబ్ వివాదానికి సంబంధం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాత్రం ఇది ముమ్మాటికి ముస్లిం గుండాలు చేసిన హత్యేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో హర్ష చురుగ్గా పాల్గొన్నాడని, అందువల్లే అతణ్ని హత్య చేసి ఉండొచ్చని మంత్రి అన్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముస్లిం గూండాలను రెచ్చగొట్టారని కూడా మంత్రి ఆరోపించారు. కాగా,
భజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై ప్రభుత్వం ఒకలా, మంత్రి మరోలా ప్రకటనలు చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. పీసీసీ చీఫ్ డీకే శివమార్ మీడియా ఘాటుగా స్పందించారు. మంత్రి ఈశ్వరప్ప మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని డీకే విమర్శించారు. హత్యోదంతం తర్వాత నిరసనలు చెలరేగడంతో శివమొగ్గలోని కళాశాలలు, పాఠశాలలను మూసివేశారు. ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Goutham Reddy సతీమణిని చూస్తే కన్నీళ్లు ఆగవు.. అమెరికా నుంచి కొడుకు వచ్చాకే అంత్యక్రియలు..
హత్య వెనుక ఉన్నవారిని ఇంకా గుర్తించలేదని, శివమొగ్గలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. కాగా హర్ష హత్యకు హిజాబ్ వివాదానికి సంబంధం ఉందనే వార్తలను ఓ పోలీసు అధికారి ఖండించారు.భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ఆధారాలు కనుగొన్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. హర్ష, యువకుల ముఠా ఒకరికొకరు తెలుసని, ఈ హత్య పాత కక్షల ఫలితంగా జరిగిందని భావిస్తున్నామని పోలీసు అధికారి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.