బదాన్లో అంగన్వాడీ హెల్పర్‌ను రేప్ చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయానికి వెళ్లిన సమయంలో ఆమెపై పూజారితో పాటు అతని అనుచరులు అత్యాచారినికి పాల్పడి.. ఆమె చనిపోవడానికి కారకులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాకు చెందిన పూజారి.. ఏడేళ్ల క్రితం బుదాన్కు వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఆలయ ప్రాంగణంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం అంగన్వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ గ్రామ శివార్లలోని ఆలయానికి వెళ్లింది. అయితే పొద్దుపోయాక కూడా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. అయితే అదే రోజు రాత్రి ఆ ఆలయ పూజారి, అతని ఇద్దరు సహాయకులు మహిళ మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకువచ్చారు. ఆమె ఆలయ ప్రాంగణంలోని ఎండిపోయిన బావిలో పడిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే ఎందుకైనా మంచిదని మృతిచెందిన మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. సోమవారం సాయంత్రం మహిళ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఆ పరీక్షలో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా వెల్లడైంది. మహిళ పక్కటెమెక పగులు వచ్చిందని, ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. అధిక రక్తస్రావం కారణంగానే మహిళ మరణించిందని బుదాన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యష్పాల్ సింగ్ తెలిపారు.
దీంతో రంగంలోని దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే బుధవారం పూజారి ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. అలాగే పూజారిని అప్పగించినవారికి పోలీసులు రూ. 50వేల నగదు బహుమతి ప్రకటించారు. ఈ క్రమంలోనే గ్రామంలో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అతని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన పూజారిని, అతని ఇద్దరు అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు.
ఇక, ఈ విషయం తెలుసుకున్న జాతీయ మహిళ కమిషన్(NCW) బృందం సభ్యులు బుధవారం బాధితురాలి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం అధికారులను కలిసి ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి జిల్లా మేజిస్ట్రేట్ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై ఒక నివేదికను సమర్పించాలని బరేలీలోని ఏడీజీ జోన్‌ను ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులకు సహకరించాలని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు సూచించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.