Home /News /crime /

ATTACK WITH STICKS MANTRAS IN VILLAGE MAASANPALLI SANGAREDDY ANDOL MANDAL VB MDK

Telangana: మంత్రాల నెపంతో అమానుషం.. కర్రలతో స్థానికుల దాడి.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

జోగిపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితులు

జోగిపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితులు

Sangareddy: మంత్రాలు చేస్తుందనే నెపంతో కర్రలతో, పిడిగుద్దులతో వారిపై స్థానికులు దాడి చేశారు. తమకు ఎలాంటి మంత్రాలు, తంత్రాలు రావని చెప్పినా వినలేదు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే..

  సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కొంతమంది మాత్రం మూఢనమ్మకాలు.. మంత్రాలు.. తంత్రాలు అంటూ భయాందోళనల మధ్య గడుపుతూ ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మూఢ‌న‌మ్మ‌కాలపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా గ్రామాలలో మాత్రం బాణావతి అనుమానంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటునే ఉన్నారు. అమ‌యాకులను హింసిస్తున్నారు. తాజాగా మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై క‌ర్ర‌లతో, పిడిగుద్దుల‌తో దాడి చేసిన ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండ‌లంలో ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మాసాన్ ప‌ల్లి గ్రామానికి చెందిన సంగెం మ‌ల్ల‌మ్మ అనే మ‌హిళ గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఇటీవల మృతి చెందింది. అయితే మ‌ల్ల‌మ్మ చావుకు అదే గ్రామానికి చెందిన సంగెం సుగుణ‌మ్మ‌, జ‌డ‌ల బాల‌ప్ప మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో క‌లిసి బాణామ‌తి చేయించింద‌ని ఆరోపిస్తూ.. వీరిపై మృతురాలి కుటుంబ స‌భ్యులు, స్థానికులు భౌతిక దాడుల‌కు దిగారు. అంత‌టితో ఆగ‌కుండా మృతురాలు మ‌ల్ల‌మ్మ మృత‌దేహాన్ని సుగుణ‌మ్మ ఇంటి ముందు పడేశారు. ఇదేంట‌ని ప్ర‌శ్నించిన పాపానికి సుగుణ‌మ్మ‌, ఆమె కుటుంబ స‌భ్యులు బంధువుల‌పై కర్రలతో , పిడిగుద్దులతో  దాడి చేశారు. మీరు చేసిన బాణామతి వల్లనే మల్లమ్మ చనిపోయిందంటూ మల్లమ్మ కుటుంబసభ్యులు సుగుణమ్మను అసభ్య పదజాలంతో దూషించారు. తనకు ఏమి తెలియదని చెప్ఫినా వారు వినలేదు.

  మాకు ప్రాణ హాని ఉంది..

  ఈ ఘ‌ట‌న‌పై బాధితులు జోగిపేట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. జోగిపేట ఎస్సై వెంక‌ట‌రాజాగౌడ్ ఇరు కుటంబాల‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇటువంటివి మరోసారి జరిగితే పరిణామాలు వేరే ఉంటాయని హెచ్చరించారు. అయిన వారు వినకుండా రాత్రి వేళ బాధితుల‌పై స్థానికులు, మల్లమ్మ బంధువులు మ‌రోసారి దాడుల‌కు దిగారు. మీరు ఈ ఊళ్లో ఉంటే అరిష్టమని.. మిమ్మ‌ల్ని చంపేస్తామంటూ బెదిరింపుల‌కు దిగ‌డంతో భ‌యాందోళ‌న‌కు గురైన బాధితులు తిరిగి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అయితే త‌మ‌కు ఎలాంటి మంత్రాలు, బాణామ‌తులు తెలియ‌ద‌నీ.. కావాల‌నే గ్రామ‌స్తులు కొంద‌రు త‌మ‌పై అన‌వ‌స‌ర నింద‌లు వేస్తూ.. అకార‌ణంగా దాడులు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమను ఊళ్లోకి రానివ్వడం లేదంటూ.. స్థానికుల నుంచి త‌మ‌కు ప్రాణ‌హాణి ఉంద‌ని పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని బాధితురాలు వేడుకుంటున్నారు.

  ప్రజలకు అవగాహన కల్పించాలి..

  ఇలాంటి వాటిని నమ్మవద్దని.. ప్రజలకు ఎలాంటి అనుమానాలు వచ్చినా పోలీసుల దృష్టికి తీసుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడితే వారి జీవితాలు, కుటుంబాలు వీధిన పడతాయని గుర్తుంచుకోవాలన్నారు. విద్యావంతులు, మేధావులు, యువతరం ప్రజలకు ఇటువంటి వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Attack with sticks, Crime news, Jogipeta, Mantras, Sangareddy, Telangana

  తదుపరి వార్తలు