Attack on TV Office: టీవీ కార్యాలయంపై మారణాయుధాలతో వీరంగం.. భయబ్రాంతులకు గురైన జర్నలిస్టులు

టీవీ కార్యాలయంలో దాడి చేసిన దుండగుడు

చెన్నైలోని సత్యం టీవీ కార్యాలయంపై ఓ దుండగుడు కత్తి, డాలుతో వీరంగం సృష్టించాడు. సిబ్బందితో మాట్లాడుతూనే అక్కడి సామగ్రి ధ్వంసం చేశాడు. ఆగంతకుడి చర్యలకు జర్నలిస్టులు భయబ్రాంతులకు గురయ్యారు.

  • Share this:
    తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్​ ప్రధాన కార్యాలయంపై ఆగంతకుడు మారణాయుధాలతో దాడి చేశాడు. కత్తి డాలు పట్టుకుని బీభత్సం సృష్టించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కాగా, అప్పటికే నిందితుడి దాడితో కార్యాలయంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవింగ్​ లైసెన్స్​ ఆధారంగా ఆ వ్యక్తిని కోయంబత్తూర్​లోని ఉప్పలిపాలెంకు చెందిన రాజేశ్​ కుమార్​గా పోలీసులు గుర్తించారు. సీసీపుటేజ్​ ఆధారంగా కేసు నమోదుచేసుకుని పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కాగా, దాడి సమయంలో రాజేశ్​ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైలోని ప్రముఖ ఛానల్‌లో సత్యం టీవీ ఒకటి. రోయపురం కామరాజరర్‌ రోడ్డులో సత్యం టీవీ ఛానల్‌ కార్యాలయం ఉంది. మంగళవారం సాయంత్రం రాజేశ్​ కుమార్​ ఓ బ్యాగుతో మామూలుగానే ఆఫీసులోకి వచ్చాడు. అక్కడి సిబ్బందితో ఓ 5 నిమిషాలు మాట్లాడాడు. చూస్తుండగానే వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన బ్యాగులో నుంచి కత్తి, డాలు బయటకు తీశాడు. రిసెప్షన్‌లో కనిపించిన ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు.

    ఎందుకు దాడి చేశాడో తెలియదు:  సత్యం టీవీ యాజమాన్యం

    అప్పటివరకు మాట్లాడుతూనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా అలా చేయడంతో టీవీ సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. పరుగులు పెట్టారు. దుండగుడు మాత్రం కార్యాలయంలోని ఒకటో అంతస్తులో ఉన్న అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బీభత్సం సృష్టించాడు. దుండగుడి చర్యలకు ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఉద్యోగులు సెక్యూరిటీ గార్డులను పిలిచారు. అప్పటికే చేతిలో కత్తి ఉన్నా.. అతడిని అతికష్టం మీద సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. రోయపురం పోలీసులకు సమాచారం అందించగా కార్యాలయానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ఘటనపై సత్యం టీవీ ఎండీ ఇసాక్‌ లివింగ్‌స్టన్‌ స్పందిస్తూ.. అతడు ఎవరో, ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదన్నారు. తాము ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదని ఎండీ తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఛానల్‌ యాజమాన్యం విడుదల చేసింది. కాగా, సత్యం టీవీ కార్యాలయంపై దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెన్నె ప్రెస్‌ క్లబ్‌ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఘటనపై రోయపురం పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు అసలు దాడి ఎందుకు చేశాడో ఇప్పటివరకు తెలియదన్నారు. అతనిపై ఇప్పటివరకు ఎలాంటి ఐపీసీ సెక్షన్లు నమోదు చేయలేదని స్పష్టంచేశారు. దాడికి సంబంధించిన విషయాలపై రాజేశ్​ను ప్రశ్నిస్తున్నామని అధికారి తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published: