(K.Veeranna,News18,Medak)
సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో ఒక యువకుడ్ని ఊరి మధ్యలో పడేసి గ్రామస్తులు చూస్తుండగానే అత్యంత కర్కశంగా కర్రలు, దుంగలతో చితకబాదారు. ఒకరిద్దరు కాదు సుమారు అరడజనుకుపైగా చుట్టుముట్టి ఆ యువకుడ్ని కూర్చున్నా, నేలపైన పడుకున్న విడిచిపెట్టకుండా కర్రలతో ఇష్టానుసారంగా కొట్టారు. ఏడుస్తూ ప్రాధేయపడుతున్న వదలకుండా తమ కసి తీరా చావబాదారు. గ్రామస్తుల చేతిలో చావు దెబ్బలు తిన్న యువకుడు ప్రస్తుతం ఆసుపత్రి(Hospital)లో చికిత్స పొందుతున్నాడు. ఒక యువకుడ్ని పట్టుకొని గ్రామస్తులు ఇంత కిరాతకంగా కొట్టడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
అమానుష ఘటన..
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలేమామిడి గ్రామానికి చెందిన నరేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గొల్ల శ్రీనివాస్ మనుషులు సోమవారం నరేష్‌ని కొట్టారు. తాను ఇంట్లో లేని సమయం చూసి తన ఇంటికి నరేష్ వస్తున్నాడని..అలా రావద్దని పలుమార్లు చెప్పాడు శ్రీనివాస్. నరేష్ పట్టించుకోకుండా సోమవారం మరోసారి శ్రీనివాస్ ఇంటి దగ్గర కనిపించడంతో అతని కుటుంబ సభ్యులంతా కలిసి కర్రలతో దాడి చేశారు. కేవలం శ్రీనివాస్ కుటుంబానికి చెందిన వ్యక్తితో నరేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతోనే ఇంతటి దారుణానికి పాల్పడినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. శ్రీనివాస్ వర్గీయుల చేతిలో నరేష్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం జహిరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఓ దళిత యువకుడ్ని గ్రామస్తులు చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వివాహేతర సంబంధమే కారణం..
దళితుడైన నరేష్‌ని పాతకక్షలను మనసులో పెట్టుకొని కులం పేరుతో దూషిస్తూ చితకబాదరని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్‌పై గొల్ల శ్రీనివాస్, రవి, గోపాల్, శేఖర్, రాములు, మంగమ్మ, రమేశ్, నరసింహులు, సంగన్న దాడికి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై తెలిపారు. చీలేమామిడిలో దళిత యువకుడిపై మూకుమ్ముడిగా దాడి చేయడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులతో పాటు భీమ్ ఆర్మీ, కేవీపీఎస్, సమతా సైనిక్ దళ్ ప్రజాసంఘాల నాయకులు సోమవారం మండిపడ్డారు. గాయపడిన నరేష్‌ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఉద్దేశ పూర్వకంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.