ముంబై క్రూయీజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ విచారణకు డుమ్మా కొట్టారు. ఆదివారంయ సాయంత్ర 6 నుంచి 8 గంటల్లోపు తమ ముందు హాజరుకావాల్సిందిగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నాడే ఆర్యన్ కు సమన్లు జారీ చేసింది. కానీ ఆరోగ్య కారణాల రీత్యా తాను రాలేకపోతున్నట్లు ఆర్యన్ సిట్ కు సమాచారం పంపారు. జర్వరం కారణంగా విచారణకు రాలేకపోతున్నానని, మంగళవారం నాడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని ఆర్యన్ ఈ మేరకు పేర్కొన్నారు.
ఆర్యన్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లుగా చెబుతోన్న క్రూయీజ్ షిప్ కేసుతోపాటు డ్రగ్స్ సంబంధిత మొత్తం ఆరు కేసులను.. ముంబైలోని ఎన్సీబీ జోనల్ ఆఫీసు నుంచి ఎన్సీబీ సిట్ కు శుక్రవారమే బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కేసుల బదిలీకి సంబంధించిన ప్రక్రియను శుక్రవారమే పూర్తి చేసిన సిట్ బృందం.. ఆయా కేసుల్లో ప్రమేయం ఉన్న పోలీస్ సిబ్బందిని సైతం ప్రశ్నించింది.
శుక్రవారం కేసులు బదిలీ కావడంతో సిట్ బృందం శనివారం నుంచే విచారణను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఆర్యన్ తోపాటు పలువురికి సమన్లు జారీ చేసింది. ఆదివారం నాటి విచారణకు ఆర్యన్ హాజరుకాకపోగా, ఇతర నిందితులైన అర్బాజ్ మర్చంట్, అచిత్ కుమార్ లు మాత్రం సిట్ విచారణకు హాజరై తమ స్టేట్మెంటు ఇచ్చారు.
ఆర్యన్ ఖాన్ సహా ఆరు కేసులను ఇన్నాళ్లూ ముంబై జోనల్ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే దర్యాప్తు చేయగా, ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేసులను సిట్ కు బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ కుమార్ సింగ్ సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 14 మంది అధికారులు సిట్ బృందంలో 14 మంది విచారణ అధికారులు ఉంటారు. వీరంతా ఢిల్లీ నుంచి ముంబైకి మకాంక మార్చిన నేపథ్యంలో దర్యాప్తు వేగంగా పూర్తి కావొచ్చని తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ కేసులో తొలి నుంచీ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోన్న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్.. తాజాగా అసలీ కేసు డ్రగ్స్ కు సంబంధించింది కాదని, కిడ్నాప్ వ్యవహారమని బాంబు పేల్చారు. బీజేపీ నేత మోహిత్ కాంభోజ్ తో కలిసి ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కిడ్నాప్ రాకెట్ ను నడిపారని, బడా బాబుల పిల్లల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి డబ్బులు లాగడమే లక్ష్యంగా ఆ రాకెట్ పనిచేసిందని, ఆర్యన్ ఖాన్ విడుదల కోసం షారూఖ్ తో రూ.18కోట్ల ఒప్పందం ఖరారైనా, ఆర్యన్ తో ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసావి సెల్ఫీ బయటికి రావడంతో కథ అడ్డం తిరిగిందని మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మంత్రి ఆరోపణలను బీజేపీ నేతలు, ఎన్సీబీ అధికారులు కొట్టిపారేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aryan Khan, Aryan khan drugs case, Mumbai