విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో మొన్న ఓ అమానుష ఘటన జరిగింది. పార్వతీపురం నుంచి బొబ్బిలివైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధ జంట ప్రయాణిస్తోంది. ఏమైందో ఏమో. జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆ వృద్ధురాలి ఒడిలోనే అకస్మాత్తుగా తుది శ్వాస విడిచాడు. అనుకోని ఈ ఘటనతో వృద్ధురాలు హతాశురాలైంది. ఏంచేయాలో తెలియక కాస్త కలవరపడింది. ఆ సమయంలో జాలి చూపించాల్సిన బస్సు సిబ్బంది.. తోటి ప్రయాణికులు మానవత్వాన్ని మంటగలిపారు. బస్సును రోడ్డుపక్క నిలిపేసి... మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని కిందకు దింపేశారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దించేస్తే బాగుండేది.. 108 కు ఫోన్ చేసినా సరిపోయేది.. పక్కన ఉన్నది వృద్ధురాలు ఆమె ఏమీ చేయలేదని.. మరోవైపు చీకపటి పడుతోందని తెలిసినా.. అవేవి పట్టించుకోకుండా బస్సు నుంచి కిందకు దింపేశారు. దీంతో దిక్కుతోచని ఆమె కన్నీరుమున్నీరైంది. మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని రోదించింది. సాయం చేయాలంటూ దారిన పోయేవారిని అర్థించింది. చాలా సేపటి వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.
చాలామంది మనుషులు జాలి అనే మాట మరచిపోయినా.. అక్కడకక్కడా కొందరు ఇంకా తమకు మనసు ఉంది అను చాటుకుంటుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే తెలిసిన మిత్రులు, జర్నలిస్టులకు సమాచారం అందించారు. వారంతా కాస్తంత ఆర్థిక సాయం చేసి మృతదేహాన్ని సొంత ఊరికి తరలించేందుకు సాయ పడ్డారు.
పార్వతీపురం, బొబ్బిలి మార్గంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పోలమ్మ, తన భర్త 58 ఏళ్ల పైడయ్యకు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం నిమిత్తం పార్వతీపురం తీసుకువెళ్లింది. తిరుగు ప్రయాణంలో బొబ్బిలి సమీపంలో పైడయ్య మృతి చెందాడు. బొబ్బిలి చేరాక సిబ్బంది, ఇతరులు కలసి ఆ మృత దేహా న్ని బస్సునుంచి దించేశారు. అక్కడ రాయఘడ రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజ్కు ఆనుకుని మృత దేహాన్ని దించేయడంతో ఆమె అక్కడే మృత దేహాన్ని తన వద్దకు తీసుకుని రోదిస్తూ సాయం చేయాలని అభ్యర్థించింది.
ఈ అమానుష ఘటన డిజిటల్, సోషల్ మీడియా, ఛానెళ్ల ద్వారా అందరికీ తెలిసింది. దీంతో ఆర్టీసీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వారు మనుషులేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు.. విషయం మంత్రి వరకు చేరింది. దీంతో ఈ ఘటన పై మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. వెంటనే ఆర్టీసి ఎండీ, వీసీ లతో సాలూరు ఘటనకు సంబంధించిన సమాచారంపై ఆరా తీశారు. అలాగే సిబ్బంది తీరుకు చీవాట్లు కూడా పెట్టినట్టు తెలిసింది. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి విజయనగరం, పార్వతీపురం డిపో మేనేజర్లు ఆ వృద్ధురాలికి క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికుల పట్ల బస్సు సిబ్బంది మానవత్వం తో వ్యవహరించాలని ఆర్టీసి ఉన్నతాధికారులకు,ఉద్యోగులకు మంత్రి నాని సూచించారు.