ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామమం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరైన దస్తగిరి(వివేకా మాజీ డ్రైవర్) ప్రొద్దుటూరు కోర్టుకు ఇచ్చిన వాగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వివేకా హత్యకు రూ.40కోట్ల సుపారీ కుదిరిందని, దీని వెనుక పెద్ద నేతల హస్తం ఉందని దస్తగిరి చెప్పాడు. వివేకాను ఎలా చంపారో పూసగుచ్చినట్లు కోర్టుకు విరించాడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాబాయి అయిన వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివేకా హత్యకేసులో ఇప్పటికే అరెస్టయిన నిదితులు.. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలను పేర్కొన్నారు. వైఎస్ కుటుంబీకుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల మద్దతుతోనే హత్యాకాండకు పూనుకున్నట్లు వివేకా మాజీ డ్రైవర్, హత్య కేసులో నిందితుడైన దస్తగిరి పేర్కొన్నారు. వివేకా హత్యలో తనతోపాటు నలుగురికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, రూ.40 కోట్ల మేర సుపారీ చేతులుమారిందని మాజీ డ్రైవర్ దస్తగిరి చెప్పుకొచ్చాడు. ఈ మేరకు దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం కాపీ శనివారం ఇతర నిందితులకు అందటంతో అందులోని అంశాలు బహిర్గతమయ్యాయి. రాజకీయంగానూ వివేకా హత్య కేసు రచ్చకు దారితీసిన నేపథ్యం, ప్రతిపక్షాలు పదే పదే ఈ అంశంలో సీఎంపైనా ఆరోపణలు గుప్పిస్తోన్న క్రమంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది. వివరాలివి..
నిందితుల వాగ్మూలంలో సంచలనాలు..
మాజీ మంత్రి వివేకానందరెడ్డి.. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురికావడం తెలిసిందే. ఏపీ సీఐడీ పోలీసులు సుదీర్గకాలం దర్యాప్తు చేసి ఏమీ తేల్చకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర సంస్థ సీబీఐ రంగంలోకి దిగి.. ఇప్పటివరకు నలుగురు నిందితుల్ని అరెస్టు చేసింది. ఆ నలుగురిలో ఒకడైన దస్తగిరి గతంలో వివేకాకు కారు డ్రైవర్గా పనిచేశాడు. వివేకా పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్ యాదవ్, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగరెడ్డి ఈ కేసులో మిగతా నిందితులు. ఈ నలుగురిపై చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ.. దర్యాప్తులో భాగంగానే 161 సీఆర్పీసీ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31న నమోదు చేశారు. ఆ వాంగ్మూలం కాపీనే ఇప్పుడు బహిర్గతమైంది.
వివేకాతో వాగ్వాదం.. దాడి..
వైఎస్ వివేకాను హత్య చేసిన తీరును కూడా మాజీ డ్రైవర్ దస్తగిరి తన వాగ్మూలంలో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. హత్యకు ముందురోజు రాత్రి 11.40కి వివేకా ఇంట్లోకి రావడం చూశామని, రాత్రి 1.30 వరకు ముగ్గురం దగ్గర్లోనే మద్యం సేవించామని, తాను(దస్తగిరి), సునీల్ ఉమా శంకర్ బైకుపై వచ్చి, వివేకా ఇంటి వెనక్కి వచ్చి పార్కింగ్ చేసి, కాంపౌండ్ లోపలికి దూకి ముందు వాకిలి(తలుపు) దగ్గర వాచ్ మెన్ రంగన్న పడుకుని ఉండటం చూసి, సైడ్ వాకిలి తలుపు తట్టామని, లోపలి నుంచి తలుపు తీసి గంగిరెడ్డి రమ్మని పిలిచాడని, అది చూసిన వివేకా ‘ఈ టైములో వీళ్లు ఎందుకు వచ్చారు’ అని అడిగారని, బెంగళూరు సెటిల్మెంట్ డబ్బుల కోసం వచ్చారని గంగిరెడ్డి బుకాయించాడని, దాంతో వివేకా అందరిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని, వాగ్వాదం నడుస్తుండగానే.. వివేకాను సునీల్ యాదవ్ బూతులు తిడుతూ ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడని, వివేకా అప్పుడు వెనక్కి పడిపోవడంతో గజ్జల ఉమా శంకర్ రెడ్డి గొడ్డలితో తలపై గాయపరచగా.. వివేకా పక్కకు తిరిగారని, వెంటనే..
కొనఊపిరితో ఉండగా ఆత్మహత్య లేఖ..
మళ్లీ వేటు వేయడంతో తల నుంచి రక్తం వచ్చిందని, వెంటనే సునీల్ యాదవ్ వివేకా ఛాతీపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, ఆ తర్వాత ఇంట్లో డాక్యుమెంట్లు వెతుకుతుండగా, వివేకా మళ్లీ కదిలారని, అప్పటికే గొడ్డలి పట్టుకుని ఉన్న తాను(దస్తగిరి) వివేకా అరచేతిపై గొడ్డలితో గాయపరిచానని, అప్పటికే సునీల్ యాదవ్, యర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డిలకు కొన్ని డాక్యుమెంట్లు దొరకడంతో ఇక వివేకాను చంపకుండా వదిలేద్దామనుకున్నామని, దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానకిి వివేకాతో బలవంతంగా ఉత్తరం రాయించి సంతకం కూడా చేయించామని, ఆ తర్వాత గంగిరెడ్డి సూచన మేరకు వివేకాను బాత్రూమ్లోకి తీసుకెళ్లామని, అక్కడ ఉమా శంకర్ రెడ్డి గొడ్డలి తీసుకుని ఐదారు సార్లు తలపై నరకడంతో వివేకా చనిపోయారని దస్తగిరి కోర్టుకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొన్నాడు. పారిపోయే ముందు వాచ్ మెన్ రంగన్న లేచి ఎవరు, ఎవరని అరిచాడని కూడా చెప్పారు.
హత్యకు కారణం భూవివాదాలా? రాజకీయాలా?
వివేకా హత్యకు ప్రధానంగా భూవివాదలే కారణమని నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి వాగ్మూలంలో చెప్పాడు. కడపకు చెందిన కొందరికి బెంగళూరులో భూములున్నాయని, వాటి సెటిల్మెంట్ కోసం వివేకాకు కోట్ల రూపాయలు అందాల్సి ఉందని, అదీగాక, 2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి వైసీపీ నేతలైన డి. శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే కారణమని వివేకా భావించారని, ఆ ముగ్గురి అంతు చూస్తానని వివేకా బెదిరించారని, తర్వాతి క్రమంలో హత్యకు వారి సహకారం కూడా ఉందని ఇతర నిందితులు చెప్పినట్లు డ్రైవర్ దస్తగిరి తన వాగ్మూలంలో పేర్కొన్నాడు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.