#జరభద్రం: అంగట్లో అమ్మేస్తున్నారు!

ప్రపంచంలో డ్రగ్స్ దందా తర్వాత ఆ స్థాయిలో జరుగుతున్న అక్రమ వ్యాపారం ఏదైనా ఉందంటే అది 'మానవ అక్రమ రవాణ'. అవును... పిల్లలు, యువతులు, మహిళల్ని అక్రమంగా తరలించేస్తున్న ఘటనలు పోలీసులకు సవాల్‌‌‌గా మారాయి.

Santhosh Kumar S | news18-telugu
Updated: July 30, 2018, 12:00 PM IST
#జరభద్రం: అంగట్లో అమ్మేస్తున్నారు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జూలై 30... యాంటీ ట్రాఫికింగ్ డే... ప్రపంచమంతా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మళ్లీ ఏడాది గడుస్తుంది. మళ్లీ ఇదే రోజు వస్తుంది. మళ్లీ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మధ్య కాలంలో మానవ అక్రమ రవాణా మాత్రం ఎప్పట్లాగే జరుగుతూ ఉంటుంది. ఇదేదో ఊరికే చెబుతున్న మాటలు కావు. ఒక్క 2016లోనే దేశవ్యాప్తంగా 8,137 వేలకు పైగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తేల్చిన లెక్క ఇది. అంతకు ముందు ఏడాది అంటే 2015లో ఈ లెక్కెంతో తెలుసా? 6,877 కేసులు. అంటే 2015 నుంచి 2016 మధ్య 18 శాతం కేసులు పెరిగాయి. ఇందులో 7,670 కేసులు లైంగిక దోపిడీకి సంబంధించినవే. 162 కేసుల్లో పిల్లల్ని అశ్లీల చిత్రాల కోసం వాడుకున్నట్టు తేలింది. ఇందులో 3,579 కేసులతో పశ్చిమ బెంగాల్ వాటానే 44.01 శాతం. ఆ తర్వాత 17.49 శాతం అంటే 1,422 కేసులతో రాజస్తాన్ రెండో స్థానంలో ఉంది. గుజరాత్(548), మహారాష్ట్ర(517), తమిళనాడు(434) కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అంతే. 2015తో పోలిస్తే 2016 నాటికి కేసుల శాతం పెరిగింతే తప్ప తగ్గలేదు. మొత్తం 22,117 మంది బాధితుల్లో 65 శాతం మహిళలే. అందులో 18 ఏళ్లలోపు యువతులే 9,034 మంది ఉన్నారు. 182 మంది విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. ఇక 2016లో మానవ అక్రమ రవాణా కేసుల్లో 10,815 మందిని అరెస్ట్ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 23(1) ప్రకారం 'మానవ అక్రమ రవాణా'పై చట్ట విరుద్ధం. బలవంతంగా పనుల్లోకి తీసుకెళ్లడం, లైంగిక దోపిడీ, వ్యభిచారం, నిర్బంధంగా చాకిరీ చేయించడం, బానిసలుగా మార్చెయ్యడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం, భిక్షగాళ్లుగా మార్చడం, పిల్లలతో లైంగిక కార్యకలాపాలు చేయించడం, అవయవ మార్పిడి లాంటివన్నీ మానవ అక్రమ రవాణా కిందకు వస్తాయి. ఇప్పటికీ దేశంలో ఏటేటా వేలాది మంది చిన్నారులు, యువతులు, మహిళల్ని అక్రమంగా తరలించేస్తున్న ఘనటలెన్నో. ఈ దందా చేసేవాళ్లు ఓ పెద్ద మాఫియా. పిల్లల్ని, యువతుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లే అమ్మే ముఠాలు వీరికి సహకరిస్తుంటాయి. ఇక ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వలలో వేసుకొని ఇలాంటి ముఠాలకు అమ్మేస్తుంటారు. లేదా పల్లెల్లో ఉపాధి పేరుతో మహిళల్ని తీసుకెళ్లి అమ్మేసే దందా చేస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తల్లిదండ్రుల్ని నమ్మించి ఎంతోకొంత డబ్బులు ఇచ్చి అమ్మాయిల్ని తీసుకెళ్తుంటారు. ఎక్కడికో తీసుకెళ్లి గుట్టుగా వ్యభిచారం చేయిస్తుంటారు. డబ్బులకు లొంగనివారిని కిడ్నాప్ చేసైనా తీసుకెళ్తున్న ఘటనలున్నాయి. ఇండియాలో టాప్ నేరాల్లో రెండో స్థానం మానవ అక్రమ రవాణాదే. వారం క్రితం లోక్‌సభలోనూ మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లుపై చర్చ జరిగింది.

ANTI TRAFFICKING DAY 2018

దేశంలో 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యమవుతోంది. మానవ అక్రమ రవాణాలో దక్షిణాసియాలో ఇండియా రెండో స్థానంలో ఉంది. 2016లో లక్ష మంది చిన్నారులు కిడ్నాప్ అయితే సగం మందిని కూడా గుర్తించలేదు. కేంద్రం మౌనంగా ఉండటం దారుణం. సరైన కార్యాచరణ, బాధితులతో పాటు సాక్ష్యుల్ని కాపాడేందుకు చట్టపరమైన విధానం, దోషులను విచారించి శిక్షించేందుకు ఏడాది కాలపరిమితి, నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బ్యూరో ఏర్పాటు మంచి అంశాలు.
కవిత, టీఆర్ఎస్ ఎంపీ


ఒక్క భారతదేశమే కాదు... ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ మానవ అక్రమ రవాణా. పెనుభూతంగా మారిన ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి జూలై 30న ప్రపంచ యాంటీ ట్రాఫికింగ్ డేగా ప్రకటించింది. ప్రభుత్వాలే కాదు స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ సమస్యపై పోరాడుతున్నాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్ అయిన స్నాప్‌డీల్ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. మీరు ఇంతకు మునుపెన్నడూ చూడని 'అమేజింగ్ కిడ్స్ సేల్' అంటూ పిల్లల మిస్సింగ్‌పై ప్రచారం చేపట్టింది. #KidsNotForSale పేరుతో ఈ ప్రచారం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇండియాలో ఒక్కో గంటకు ఏడుగురు చిన్నారులు మిస్సింగ్ అవుతున్నారని లెక్కతేల్చింది.

ANTI TRAFFICKING DAY 2018
IMAGE: SNAPDEAL
Published by: Santhosh Kumar S
First published: July 30, 2018, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading