వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉండగా కలిసి బతకాలని అనుకున్నారు. కానీ చివరకు ప్రియుడు ప్లేట్ ఫిరాయించాడు. దీంతో అతడితో కలిసి తన జీవితాన్ని ఊహించుకున్న ఆ యువతి ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో ఆ వ్యక్తి మరోకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడనే అనుమానం కలిగింది. దీంతో తీవ్ర ఆవేశంలో పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని హత్య చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు, తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జీ పావని గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను.. వివాహ బంధంగా మార్చాడానికి పావని ప్రయత్నించింది. కొద్ది నెలలుగా పెళ్లి చేసుకోవాలని ప్రియుడు తాతాజీ నాయుడును అడిగింది. అయితే పెళ్లి చేసుకునేందుకు తాతాజీ నిరాకరించాడు.
అయితే సోమవారం మధ్యాహ్నం తాతాజీ బైక్‌పై పంగిడి వచ్చాడు. పావని కూడా అక్కడికి వచ్చింది. సాయంత్రం వరకు పంగడి పరిసర ప్రాంతాల్లో వీరిద్దరు తిరిగారు. అనంతరం తాతాజీ పావనిని బైక్‌పై ఎక్కించుకుని ఆమె ఉరు మలకపల్లిలో దించేందుకు బయలుదేరాడు. అయితే అప్పటికే తాతాజీని అంతం చేయాలని ప్లాన్ వేసిన పావని.. బైక్ ధర్మవరం-కాపవరం గ్రామాల మధ్యకు చేరుకున్న సమయంలో తన పథకాన్ని అమలుచేసింది. వెళ్తుండగా తన బ్యాగ్‌లోని కత్తి తీసి తాతాజీ వీపుపై పొడించింది. ఈ ఘటనతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడిపోయారు. కిందపడిన తాతాజీపై పావని మళ్లీ కత్తితో దాడి చేసింది.
దీంతో తీవ్ర రక్తస్రావమైన తాతాజీ ఘటన స్థలంలోనే మృతిచెందారు. ఇది గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్నవారు స్థానిక పోలీసులకు సమచారమిచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు తాతాజీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by:Sumanth Kanukula
First published:January 12, 2021, 06:40 IST