Andhra Pradesh: తీవ్ర విషాదం.. కూతురు కళ్ల ముందే మృత్యుఒడిలోకి..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ.. ఆమె కూతురు కళ్లముందే మృత్యు ఒడిలోకి చేరింది. తల్లి మృతదేహం వద్ద కూతురు రోధించిన తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది.

  • Share this:
    ఓ మహిళ.. ఆమె కూతురు కళ్లముందే మృత్యు ఒడిలోకి చేరింది. తల్లి మృతదేహం వద్ద కూతురు రోధించిన తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఆంధ్రా ఒడిశా సరిహద్దులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. కవిటి మండలం ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన బోరుభద్ర మోహనరావు, సరస్వతి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గ్రామంలో ఉపాధిలేక అయిదేళ్లుగా ఒడిశాలోని బ్రహ్మపుర గేటుబజారు వద్దనున్న గొల్లపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరు రెండు నెలలకొకసారి స్వగ్రామం వచ్చి వెళ్తుంటారు. సరస్వతి డ్వాక్రా గ్రూప్‌లో సభ్యురాలు కావడంతో.. శుక్రవారం డ్వాక్రా గ్రూపు పనుల నిమిత్తం తల్లీకుమార్తెలు ద్విచక్ర వాహనంపై ప్రగడపుట్టుగకు వచ్చి పనులు పూర్తి చేసుకున్నారు.

    శనివారం తిరిగి ఒడిశాకు బయలుదేరారు. స్వాతి డ్రైవింగ్‌ చేస్తుండగా తల్లి సరస్వతి వెనుక కూర్చున్నారు. పురుషోత్తపురం అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి.. వీరిద్దరు ద్విచక్ర వాహనంతోపాటు రోడ్డుపై పడిపోయారు. అయితే అదే సమయంలో లారీ సరస్వతి తలపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సరస్వతి అక్కడికక్కడే మృతిచెందింది. అయితే స్వాతి హెల్మెట్ ధరించి ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడింది.

    అయితే తన కళ్లముందే తల్లి మృతిచెందడం చూసిన స్వాతి గుండెలు పగిలేలా రోదించింది. ఈ క్రమంలోనే ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే స్థానికుల ఆమెను ఇచ్చాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సరస్వతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: