ఆంధ్రప్రదేశ్ లో పండుగ వేళ దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై కన్నేసిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రివేళ లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని నమ్మించిన ఆ దుర్మార్గులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది.గన్నవరం మండలం, తెంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ.., వేరే ప్రాంతంలో నివాసముంటోంది. సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వస్తోంది. గన్నవరం నుంచి తెంపల్లి వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు లేకపోవడం, ఆటోలు కూడా దొరక్కపోవడంతో అటువైపుగా వస్తున్న ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామన్నారు. దీంతో ఆమె కూడా వారి బైక్ ఎక్కింది. ఐతే ఆమెను గ్రామానికి తీసుకెళ్లకుండా రూటు మార్చిన యువకులు..,ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పట్టపగలే ఈ దారుణం జరిగినా ఎవరూ గుర్తించలేకపోయారు.
నిందితుల అరెస్ట్
మృగాళ్ల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన యువకులు తెంపల్లివాసులుగా పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేసినట్లు ఆత్కూరు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. గన్నవరం నుంచి తెంపల్లి వెళ్లే మార్గంలోని బల్లిపర్రు గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై నిందితులను విచారిస్తున్న పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే మధ్యాహ్నం సమయంలో ఘటన జరగ్గా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. పట్టపగలు మహిళపై దారుణం జరిగినా ఎవరూ గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Published by:Purna Chandra
First published:January 13, 2021, 10:22 IST