ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ అంటే ఠక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్ గొడవలు. సీమలో ఎక్కడో ఓ చోట ఇప్పటికీ దాయాదుల మధ్య గొడవలు, ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇక అనంతపురం జిల్లాలో రక్త చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లాలో ఫ్యాక్షన్ గురించి ఏకంగా సినిమాలే వచ్చాయి. తాజాగా నాటు బాంబులతో ప్రత్యర్థుల్ని హచమార్చేందుకు కుట్రపన్నిన ముఠాను అనంతపురం జిల్లా కంబదూరు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 23 నాట బాంబులను సీజ్ చేశారు. ఇందులో 13 పెద్దసైజు నాటు బాబులు, 10 చిన్నసైజ్ నాటు బాంబులు ఉన్నాయి. గతంలో జరిగిన రెండు హత్యలకు ప్రతీకారంగానే కుట్రపన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్యకేసుల్లో నిందితుల నుంచి ప్రాణహాని ఉందనే భయంతోనే నాటు బాంబులు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. కంబదూరు, మండలం తిప్పేపల్లికి చెందిన ఎరికల రాజశేఖర్, గొల్ల లింగరాజు, కనగానపల్లి మండలం, వేపకుంట గ్రామానికి చెందిన ఎరికల దేవరకొండ రామచంద్ర, వడ్డే హరి, అనంతపురానికి చెందిన వడ్డే నగేష్, V.నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.... ప్రస్తుతం అరెస్టయిన ఎరికల రాజశేఖర్, ఎరికల దేవరకొండ రామచంద్రలు సమీప బంధువులు. ఎరికల రాజశేఖర్ కు దేవరకొండ రామచంద్ర స్వయాన మేనమామ అవుతాడు. 2010లో వీరి సమీప బంధువైన కనగానపల్లి మండలం వారాదికొట్టాలకు చెందిన ఎరికల గోపాల్ హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్య కేసులో ఎరికల చంద్రశేఖర్, ఎరికల గంగాధర్, మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో మందుపాతర పేల్చి ఎరికల దుర్గప్పను హతమార్చారు. ఎరికల రాజశేఖర్, దేవరకొండ రామచంద్రలకు హతుడు సమీప బంధువు అవుతాడు. ఈ కేసులో కూడా ఎరికల చంద్రశేఖర్, ఎరికల గంగాధర్ లు నిందితులుగా ఉన్నారు. సమీప బంధువులిద్దర్నీ హతమార్చిన ఎరికల చంద్రశేఖర్, ఎరికల గంగాధర్ లపై ప్రతీకారం తీర్చుకోవాలని మరియు ఆ ఇద్దరూ తమను చంపే అవకాశముందని మేనమామ, మేనల్లుడు భావించారు.
ఈ క్రమంలో ఎరికల చంద్రశేఖర్, ఎరికల గంగాధర్ లను తామే ముందుగా చంపాలని నిశ్చయించుకున్నారు. ఇందులో ఎరికల రాజశేఖర్ తల్లి ఎరికల ముత్యాలమ్మ ప్రోద్భలం ఉంది. ఆ ఇద్దరి హత్యకు వ్యూహరచన చేశారు. వడ్డే హరితో చర్చించి నాటు బాంబుల తయారీకి అవసరమైన ముడి సరుకును వడ్డే నగేష్, ఇంకో వడ్డే నగేష్ ల ద్వారా సమకూర్చుకున్నారు. తిప్పేపల్లి శివార్లలో ఉన్న గొల్ల లింగరాజు తోటలో నాటు బాంబులు తయారు చేయించారు. ఈక్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Andhra pradesh news, Bomb blast, Crime, Crime news