ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో తమ పిల్లల్ని బడికి పంపించే తల్లులకు ప్రోత్సాహకంగా జగనన్న అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈనెల 11న నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. ఐతే ఇప్పుడదే కొన్ని కాపురాల్లో చిచ్చుపెడుతోంది. మద్యం తాగడానికి అమ్మఒడి నగదు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో కిరాతక భర్త. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా
అనంతగిరి మండలంలో చోటుచేసుకుందీ ఘటన. గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ, భీమన్న భార్యభర్తలు. ఇద్దరూ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సనలుగురు సంతానం. ఇటీవల ప్రభుత్వం జమ చేసిన ‘అమ్మఒడి’ సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఎకౌంట్ లో జమైంది.
ఐతే తాగుడుకి బానిసైన భర్త భీమన్న., డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు దేవుడమ్మ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే రోజు గుమ్మకోట సంతకు వెళ్లిన సమయంలోనూ డబ్బులు డ్రా చేయాలని ఆమెను కోరాడు. ఎంత చెప్పినా భార్య ఒప్పుకోకపోవడంతో..సంత నుంచి ఇంటికి వెళ్లే దారిలో పొలాల వద్ద ఆమెను బండరాయితో మోది హత్య చేశాడు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అమ్మఒడి సొమ్ము విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయాన్ని పిల్లలు, స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా భీమన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత తనకేం తెలియదని బుకాయించిన బీమన్న.., పోలీసులు నాలుగు తగిలించేసరికి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Husband kill wife, Visakhapatnam