ఈ రోజుల్లో యువతకు చిన్నవయసులోనే పెద్దపెద్ద ఉద్యోగాలు వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ కొలువు దక్కితే చాలు పాతికేళ్లకే లక్షల్లో జీతం వస్తుంది. ఐతే భారీగా వచ్చే జీతాలతో కొంతమంది పక్కదారి పడుతున్నాడు. సరదాగా చేసిన పనులే వ్యసనంగా మారి ప్రాణాలు తీస్తున్నాయి. క్రికెట్ పై ఉన్న పిచ్చి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కొమగిరిపట్నానికి చెందిన ఆకులు వంశీ రామ తిరుపతి రావు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. పదేళ్ల క్రితం తన గ్రామానికే చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో ఇద్దరూ హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నారు. కానీ తిరుపతిరావుకు క్రికెట్ అంటే పిచ్చి.. ఆ పిచ్చే జీవితాన్ని తలకిందులు చేసింది.
మూడేళ్ల క్రితం ఉద్యోగం పోవడంతో వంశీ తన స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి భార్య విడిగానే ఉంటోంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడ్డ వంశీ లక్ష కాదు, రెండు లక్షలు కాదు ఏకందా రూ.కోటిన్నర అప్పు చేశాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువవడంతో అతని తండ్రి కొంత అప్పులు తీర్చాడు. అయినా బుద్ధిరాకపోవడంతో మళ్లీ బెట్టింగులకు పాల్పడుతూనే ఉన్నాడు. తెలిసిన వారు కూడా అప్పులివ్వడం మానేయడంతో వేరే దారి లేక పొలంలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన వంశీ చిన్నాన్న అతడ్ని అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నవయసులోనే మంచి ఉద్యోగం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వంశీని ఒక్క వ్యసనం బలితీసుకుంది. బెట్టింగులు వద్దని భార్య, తల్లిదండ్రులు మొత్తుకున్నా వినకుండా బెట్టింగులు వేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. మరోవైపు చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక మారతాడునుకున్న భర్త ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో వంశీ భార్య జీర్ణిచుంకోలేకపోతోంది.
Published by:Purna Chandra
First published:January 27, 2021, 13:14 IST