దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. ప్రేమించలేదనో, పెళ్లికి అంగీకరించలేదనో.., సరిగా మాట్లాడటం లేదనో ఆడపిల్లలపై కొందరు మృగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలు సరిగా అమలు కాకపోవడంతో అమ్మాయిలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో యువతి ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన యువతి పోతనపెట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు అనే యువకుడు ప్రేమించుకున్నారు.
రహస్యంగా పెళ్లి
ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఢిల్లీబాబు, యువతి ఇంట్లలో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఐతే యువతి మైనర్ కావడంతో పెళ్లి చెల్లదంటూ పోలీసులు ఇద్దర్నీ ఇంటికి పంపేశారు. అప్పటి నుంచి ఢిల్లీ బాబును యువతి దూరం పెడుతూ వస్తోంది. ఢిల్లీ బాబు ఆమెను కలిసేందుకు వచ్చినా ఆమె తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారు. ఆమెను తనతో వచ్చేయాలని కోరగా నిరాకరించింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్రణాళిక వేశాడు.
దారికాచి కిరాతకం
ముంగళవారం గాయత్రి తన బంధువుల ఇంటి నుంచి మరో అమ్మాయితో కలిసి బైక్ పై వస్తోంది. ఆమె రాకను గమనించిన ఢిల్లీ బాబు ఆమెను దారిలో అడ్డుకున్నాడు. తనతో వస్తావా లేదా అంటూ వాగ్వాదానికి దిగి కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 15సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆఘకుండా ఆమె గొంతుకోశాడు. తీవ్రగాయాలపాలైన యువతిని బంధువులు పెనుమూరు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలిస్తుండగా గాయత్రి మృతి చెందింది.
గాయత్రిపై దాడి చేసిన ఢిల్లీ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ప్రియురాలి బంధువులు ఆగ్రహంతో ఢిల్లీబాబు ఇంటిపై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు అతని తండ్రి షణ్ముఖ్ రెడ్డిని చితకబాది చెట్టుకు కట్టేశారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు పోలీసులు ఢిల్లీ బాబు కోసం గాలిస్తున్నారు.
Published by:Purna Chandra
First published:January 19, 2021, 16:18 IST