తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై దంపతులను కిరాతకంగా నరికి చంపడంపై లాయర్లు మండిపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతుండగా.. ఏపీలోనూ జంట హత్యలను నిరసిస్తూ లాయర్లు ఆందోళనకు దిగారు. విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సిటీ సిటీసివిల్ కోర్టు నుంచి నిరసన యాత్ర చేపట్టిన న్యాయవాదులు.. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీలో వందలాది మంది లాయర్లు పాల్గొన్నారు. వివాదాల నేపథ్యంలో లాయర్లను హత్య చేయడాన్ని ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రతినిథులు అన్నారు.
హైకోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత కాలపరిమితితో విచారణ పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని.. ఈ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి కోర్టుకు సమర్పించాలని సూచించింది. అనంతరం కేసు తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
లాయర్ల జంట హత్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. గురువారం విచారణకు వచ్చే అన్ని కేసులను బహిష్కరించినట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, కూకట్ పల్లి కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హంతకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దోషులను శిక్షించాలని లాయర్లు డిమాండ్ చేశారు.
ఆడియో టేపుల కలకలం
ఇక జంటహత్యల కేసుకు సంబంధించిన ఓ ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. నిందితుడు కుంట శ్రీనివాస్, సుపారీ గ్యాంగ్ తో మాట్లాడిన ఆడియో టేపు బయటకు వచ్చింది. ఇది 2018లో మాట్లాడినట్లు గా గుర్తించిన పోలీసులు.. ఐతే ఆడియో టేపు ఎంతవరకు నిజమొ కాదో అనే విషయం తెలియాల్సి ఉంది. గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంట శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా.. ‘గుడి కూలితే వామనారావు కూలిపోతాడు' అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Crime, Crime news, Murders, Peddapalli, Telangana, Telangana High Court, Telugu news