Doctor Bribe: వైద్యో నారాయణో హరీ అంటాం.. అంటే దీని అర్థం వైద్యుడు దేవడితో సమానం అని.. కానీ అసలు అర్థం మార్చేస్తున్నారు కొందరు వైద్యులు (Doctors).. వైద్యం కోసం వెళితే వేధిస్తామంటూ రెచ్చిపోతున్నారు కొందరు. కార్పొరేట్ వైద్యం వెర్రితలలు వేయడం మొదలు పెట్టాక, మనిషి ప్రాణానికి రేటు కడుతున్నారు.. చనిపోయిన తరువాత వదలడం లేదు.. కాసుల కక్కుర్తితో మానవత్వాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కార్పొరేట్ వైద్యులను చూసి.. ప్రభుత్వం వైద్యులు (Government Doctors) సైతం అదే దారి పడుతున్నారు. తాజాగా మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరి (Udayagiri) ప్రభుత్వాస్పత్రిలో ఓ డాక్టర్ కక్కుర్తి వ్యవహారం.. మాయని మచ్చగా మిగిలింది. ఛీ ఛీ ఇంత నీచమా అని తిట్టుకునేలా చేస్తోంది. వైద్య వృత్తికే కళంకం తీసుకొచ్చింది.
భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పుట్టెడు దు:ఖంలో ఉన్నఆమెను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది.. కానీ ఆ డాక్టర్ తీరు వేరు.. ఎవరు ఎలాపోతే తనకేం అనుకున్నాడు.. ఒంటరి మహిళ అని తెలిసి కూడా.. లంచం కావాలని వేధించాడు.. భర్తది ఆత్మహత్య కావడంతో పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ చందాని బాషా ఏకంగా పదిహేను వేలు డిమాండ్ చేశాడు. పేద మహిళ.. ఇప్పుడు ఒంటరి అయ్యింది అని.. కనీసం మానవత్వం లేకుండా శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం చేశాడు ఆ వైద్యుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఉదయగిరి ప్రభుత్వాస్పత్రిలో కాసుల వేటపై ప్రభుత్వం సీరియస్సైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణ అనంతరం వైద్యుడిపై చర్యలు తీసుకుంది.
ఈ అమానుష ఘటన మీడియా వరకు చేరడంతో.. ఆ డాక్టర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుడు ముదిరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) కుక్కునూరు మండలం రాయకుంట గ్రామానికి చెందిన వాడు.. కుటుంబ పోషన కోసం.. తన భార్యా పిల్లలతో సహా ఉదయగిరికి వచ్చాడు.. అయితే యజమాని ఇస్తానన్న జీతం డబ్బులు సరిగా ఇవ్వక పోవడంతో పాటు అప్పుల భారం పెరగడంతో… తన కుటంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్ధం కాక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చదవండి : సహపంక్తి భోజనాలతో సిక్కోలులో ఫుల్ జోష్.. బాదుడే బాదుడులో జగన్ పై నిప్పులు
అతడి ఆత్మహత్య కావడంతో.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ చందాని బాషా లంచం డిమాండ్ చేశాడు. తనకి 15వేల రూపాయలు, అటెండర్ కి వెయ్యి రూపాయలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామన్నాడు. లేదంటే అంతే సంగతులని మోహమాటం లేకుండా తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక భార్య కన్నీరుమున్నీరైంది. ఆ ఆడియో వైరల్ కావడంతో బాషా ఇన్నాళ్ల పాటు ఎన్ని శవాలను పీక్కుతిన్నాడో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం..
ఇదీ చదవండి : పదో తరగతి పేపర్లు లీక్ చేసింది వాళ్లే.. పేర్లు బయటపెట్టిన సీఎం జగన్
అతడు డాక్టర్ కాదు.. మానవ రాబందు అంటూ మండిపడుతున్నారు. ఇంకా ఇలాంటి అభాగ్యులను ఎంతగా పీడించుకు తిన్నాడో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ వైద్యుడు చందాని బాషాపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన హైలెట్ అయ్యింది కాబట్టి.. 1 నెల లేదా 2 నెలలు సస్పెండ్ చేసి మళ్లీ విధుల్లోకి తీసుకుంటే.. ఇలాంటి లంచం రాబందులు మళ్లీ ఇలానే ప్రవర్తిస్తారు. శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెడితేనే ఇలాంటి వారికి బుద్ధి వస్తుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Doctors, Nellore