ANDHRA PRADESH CRIME NEWS GUNTUR DISTRICT RBK THEFT CASE CHASED BY POLICE NGS GNT
Crime News: ఆర్బీకే చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. కన్నమేసింది ఇంటి దొంగేనా..?
ఆర్బీకేకి కన్నమేసింది ఇంటి దొంగేనా..?
Crime News: ఆర్బీకే సెంటర్ లో జరిగిన చోరీ కేసులో ట్విస్టులపై ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు, సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది.
అన్నా రఘు న్యూస్ 18, అమరావతి ప్రతినిధి.. Andhra Pradesh Crime news: అన్నయ్య మా ఆర్ బీకే సెంటర్ (RBK Center) లో దొంగతనం (Theft)జరిగిందట..ఏం జరిగిందో చూడండి అంటూ రైతు భరోసా కేంద్రంలో బాధ్యురాలైన ఉద్యోగి (Employee).. తనతో పాటు మరో గ్రామంలో పని చేస్తున్న సహోద్యోగికి తీరని దుఃఖంతో ఫోన్ చేసింది.. వెళ్లి ముందు నువ్వు చూడు.. తరువాత నేను వస్తాను అంటూ కన్నీరు పెట్టుకుంది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది.. డబ్బు పోగొట్టుకున్న బాధితురాలు.. నేరుగా దొంగకే ఫోన్ చేసి సహాయం అడిగింది.. కానీ ఆమెకు ఆ విషయం తెలియదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..? గత నెల 28వ తేదీన గుంటూరు జిల్లా(Guntur District)లోని ముప్పాళ్ళ మండలం చాగంటి వారిపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఒక లక్షా 92 వేల రూపాలయ నగదు చోరీకి గురైంది.
ఉదయం కార్యాలయానికి వచ్చి తలుపులు తీసిన వ్యవసాయ అధికారులు షాక్ అయ్యారు. తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి ఆర్ బి కే లో వి.ఏ.ఏ గా పనిచేస్తున్న పచ్చల శైలజ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. శైలజ కంగారుపడుతూ ఆందోళనలో ఇదే మండలంలో గోళ్లపాడు గ్రామంలో విఏఏ ( విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్)గా పనిచేస్తున్న మాచర్ల షేక్ సైదా వలికి ఫోన్ చేసి ఆర్బికే వద్దకు వెళ్లి పరిశీలించమని చెప్పింది. తరువాత ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు.
ఈ దర్యాప్తు లో తేలిన విషయం ఏంటంటే శైలజ సహాయం అడిగిన సదరు గోళ్లపాడు వి ఏ ఏ సైదానే అసలు దొంగ అని పోలీసులు తేల్చారు. దీంతో బాధితురాలు స్థానికులు, అధికారుల ఖంగుతిన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర ఆధారాలతో సైదా వలిని అనుమానించి ఒకటో తేదీన అదుపులోకి తీసుకొని విచారించారు.
విచారణలో పూర్తి ఆధారాలు లభ్యమైన తరువాత అతడిని అరెస్ట్ చేసి.. చోరీకి గురైన 1.92 లక్షల రూపాయల నగదును స్వాధీన పరుచుకుని , సైదావలిని కోర్టులో హాజరు పరిచారు. తోటి సిబ్బందే కార్యాలయంలో ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన నగదును దొంగిలించాడని తేలియడంతో అందరూ అవాక్కయ్యారు.
చోరీకి గురైన నగదు లభించకపోతే శైలజ ఉద్యోగ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేది. మొత్తం మీద ఎస్సై ఎం. పట్టాభి రామయ్య చాక చక్యంగా వ్యవహరించి, కేసును త్వరితంగా చేధించి సొత్తు మొత్తాన్ని రికవరీ చేయడంతో సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.