కోల్‌కత్తా: చేతిలో నగదు లేకపోతే దగ్గర్లో ఏటీఎం ఎక్కడుందో వెతుక్కుని అక్కడికెళ్లి డబ్బు విత్‌డ్రా చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఏటీఎంలో సాంకేతిక సమస్య తలెత్తితే ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు రాదు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో లావాదేవీ రద్దయినట్లు సందేశం కనిపిస్తుంది. కానీ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఓ ఏటీఎంలో మాత్రం డబ్బు తీసేందుకు ప్రయత్నిస్తే నగదు రాకపోగా ఖాతా నుంచి నగదు డెబిట్ అవుతుండటంతో ఆ ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించిన ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఓ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏటీఎంపై ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది పెన్షన్‌దారులు సదరు ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. ఏటీఎం నుంచి డబ్బు రాకపోగా వారి ఖాతా నుంచి నగదు డెబిట్ అవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12.19 నిమిషాల నుంచి ఈ ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించిన వారందరికీ ఈ పరిస్థితే ఎదురయినట్లు పోలీసుల విచారణలో తేలింది. బ్యాంకు అధికారులు పోలీసులకు సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన డీవీడీని అందించారు. ఆ వీడియోను గమనించిన పోలీసులు ఫిబ్రవరి 14న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి వెళ్లడాన్ని గమనించారు. అయితే.. వాళ్లే ఏటీఎంను టాంపర్ చేసేరా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. వీళ్లు వెళ్లిపోయిన 19 నిమిషాల తర్వాత ఓ కస్టమర్ నగదు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లాడు.
నగదు చేతికి రాకుండానే డబ్బు డెబిట్ కావడంతో బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏటీఎంను టాంపర్ చేసింది ‘గ్లూ’ గ్యాంగేనని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఖాతాదారులు నగదు డ్రా చేసినప్పుడు ఆ డబ్బు ‘ట్రే’ వరకూ వచ్చి ఆగేలా ఈ గ్యాంగ్ టాంపర్ చేస్తుందని.. డబ్బు రాలేదని భావించి వినియోగదారులు వెళ్లిన తర్వాత ఎవరూ రాని సమయం చూసి ఆ ‘ట్రే’ను బయటకు లాగి.. అందులో ఉన్న డబ్బును ఈ గ్యాంగ్ దొంగిలిస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి దొంగతనాలకు అవకాశం లేకుండా బ్యాంకులు ఏటీఎంల్లో సాంకేతికను అభివృద్ధి చేశాయని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.