బాలాఘాట్: ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో కోపం రావడం సహజం. కానీ.. ఆ కోపం తనకు చేటు చేసేదిగా ఉండకూడదు. ‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. స్వీయ అనుభవంలో ఈ తత్వం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు బోధపడుతుంది. అందుకే కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కానీ.. మధ్యప్రదేశ్‌లో కోపిష్టి భర్త ఏం చేశాడో తెలిస్తే ఎంత శాంతంగా ఉండేవారికైనా కోపం రాక మానదు. ఇలాంటోళ్లు కూడా ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. భర్త స్నానం చేసి బయటకు వచ్చాడు. భార్య ఏదో పనిలో ఉండి టవల్ ఇవ్వడానికి కాస్త ఆలస్యమైంది. అంత మాత్రానికే ఆ భర్త కోపంతో భార్యను చంపేశాడు. నమ్మడానికి మనసు అంగీకరించకపోయినా ఇదే నిజం. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ బహె(50) అటవీ శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య పుష్పాబాయి(45) ఇంటి వద్దే ఉంటుండేది. వీళ్లకు 23 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. గత శనివారం రోజూలానే పనికి వెళ్లి సాయంత్రం రాజ్‌కుమార్ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో పుష్ప అంట్లు కడుగుతోంది. కూతురు కూడా తల్లికి పనిలో సాయంగా ఉంది. ఆ సమయంలో ఇంటికొచ్చిన రాజ్‌కుమార్ స్నానం చేసేందుకు వెళ్లాడు.
స్నానం చేశాక భార్యను టవల్ తీసుకురమ్మని కేకేశాడు. అంట్లు కడుగుతున్న పుష్ప ఆ పనిలో ఉండి టవల్ తీసుకెళ్లడం కాస్త ఆలస్యమైంది. అంతే.. భార్యపై రాజ్‌కుమార్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. టవల్ తీసుకురమ్మని ఎప్పుడు చెబితే ఎప్పుడు తీసుకొచ్చావంటూ భార్యపై కోపంతో అరిచాడు. అంతటితో ఆగకుండా తాపీతో ఆమె తలపై పదేపదే కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక పుష్ప కుప్పకూలిపోయింది. అమ్మను ఎందుకు కొడుతున్నావంటూ ఆపేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా రాజ్‌కుమార్ చంపేస్తానని బెదిరించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పుష్ప స్పాట్‌లోనే చనిపోయింది.
పుష్ప మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 302, 201, 506 కింద కేసు నమోదు చేశారు. కోర్టు నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేవలం భార్యపై క్షణికావేశంలో పెంచుకున్న కోపం రాజ్‌కుమార్‌ను హంతకుడిని చేసింది. చివరికి జైలు పాలయ్యేందుకు కారణమైంది. తన తండ్రి పలుమార్లు తన తల్లి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్త స్రావమైందని, ఈ క్రమంలోనే ఆమె కొంతసేపు గిలగిలా కొట్టుకుని ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయిందని పుష్ప కూతురు నేహా కన్నీరుమున్నీరయింది. తన తండ్రిని కఠినంగా శిక్షించాలని.. అర్థం లేని ఆవేశంతో కట్టుకున్న భార్యను పొట్టనపెట్టకున్నాడని నేహా తల్లి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime news, Madhya pradesh, Wife murdered