Mobiles Theft: రూ. 10 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీ.. అంతా సినీ ఫక్కీలో..

ప్రతీకాత్మక చిత్రం

Mobiles Theft News: లారీని నగరి సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ మరో లారీలోకి ఆ సెల్‌ఫోన్లకు సంబంధించిన పార్సిల్స్‌ను మార్చారు. ఇదంతా చూసే వాళ్లకు దొంగతనం అనిపించుకుండా ఓ లారీ నుంచి మరో లారీకి లోడు మార్చినట్టుగా భ్రమలు కల్పించారు.

  • Share this:
    ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 10 కోట్లు విలువైన సెల్‌ఫోన్లను కొట్టేశారు దుండగులు. అక్కడ ఇక్కడ కాకుండా ఏకంగా ఆ సెల్‌ఫోన్లు తీసుకొస్తున్న లారీనే తెలివిగా అడ్డగించి అందులోని సెల్‌ఫోన్లను తీసుకుని ఉడాయించారు. తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంచీపురంలోని శ్రీపెరంబదూరులోని షావోమి కంపెనీ నుంచి సెల్‌ఫోన్లను ముంబై తీసుకెళుతున్న లారీని దుండగులు సినీ ఫక్కీలో దోచేశారు. లారీ ఏపీలోకి అడుగుపెట్టిన వెంటనే.. మరో లారీతో ఈ సెల్‌ఫోన్లు ఉన్న లారీని ఢీ కొట్టారు. అనంతరం డ్రైవర్‌తో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత తమ దగ్గర ఉన్న గన్ చూపించి ఆ డ్రైవర్‌ను బెదిరించారు. అతడి కాళ్లు చేతులు కట్టేశారు.

    లారీని నగరి సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ మరో లారీలోకి ఆ సెల్‌ఫోన్లకు సంబంధించిన పార్సిల్స్‌ను మార్చారు. ఇదంతా చూసే వాళ్లకు దొంగతనం అనిపించుకుండా ఓ లారీ నుంచి మరో లారీకి లోడు మార్చినట్టుగా భ్రమలు కల్పించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం చోరీ అని ఎవరూ అనుకోలేదు. తన కట్లు విప్పుకుని పోలీసులను ఆశ్రయించిన లారీ డ్రైవర్ చెప్పేంతవరకు నగరి సమీపంలో ఇంత పెద్ద చోరీ జరిగిందనే విషయం వెలుగులోకి రాలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: