విరుధునగర్: మద్యం ఎందరి కాపురాల్లోనో చిచ్చు పెడుతోంది. మద్యానికి బానిసైన కొందరు భర్తల దాష్టికానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రోజూ తాగి రావడం, భార్యతో గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టుకుంటూ వారిని తిట్టడం, కొట్టడం చేస్తూ హింసిస్తున్నారు. తాగుడుకు బానిసైన ఆ భర్త పెట్టే బాధలు భరించలేక కొందరు మహిళలు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటుంటే మరికొందరు భర్త ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలోని అరుప్పుకొట్టైలోని గాంధీనగర్ పిళ్లైయార్‌కోయిల్ వీధిలో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. మద్యానికి బానిసైన భర్త పెడుతున్న చిత్రహింసలు భరించలేక కట్టుకున్న వాడినే భార్య కడతేర్చింది. ఈ ఘటన స్థానికంగా ఉలిక్కిపడేలా చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవతి (36), రాజారామ్(45) భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలకు తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. రాజారామ్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. భార్యాపిల్లలతో కలిసి సుఖంగా ఉండాల్సిన రాజారాం కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసగా మారాడు. రాజారాం రోజూ తాగి ఇంటికొచ్చేవాడు. ఇంట్లో పిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భార్యతో ఏదో ఒక విషయంలో వాగ్వాదానికి దిగేవాడు. రేవతి భర్త ప్రవర్తనతో విసిగిపోయింది. భర్త వైఖరితో తీవ్ర మనస్తాపం చెంది ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపింది. కొన్ని రోజుల నుంచి రాజారాం మరింత శాడిస్టుగా మారాడు. భార్యను తిడుతూ, కొడుతూ హింసించడం మొదలుపెట్టాడు.
భర్త ప్రవర్తనతో విసిగి పోయిన రేవతి ఇక ఉపేక్షించకూడదనుకుంది. కానీ.. క్షణికావేశంలో ఆమె తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాజారాం రోజూలానే మద్యం తాగి ఇంటికి వచ్చి రేవతితో గొడవపడ్డాడు. ఈసారి ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఒకానొక సమయానికి సంయమనం కోల్పోయిన రేవతి క్షణికావేశంలో కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తీసుకుని రాజారాంపై దాడి చేసింది. ఈ దాడిలో రాజారాం తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పికి తాళలేక అతను కేకలేయడంతో ఇరుగుపొరుగు వాళ్లు ఏం జరిగిందోనని కంగారుగా వచ్చి చూసేసరికి రాజారాం రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు బాడీని సీజ్ చేసి, రేవతిని అరెస్ట్ చేశారు.
మద్యానికి బానిసగా మారిన భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న తాను క్షణికావేశంలో భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టానని.. కానీ చనిపోతాడని అనుకోలేదని రేవతి పోలీసు విచారణలో చెప్పింది. తల్లి చేతిలోనే తండ్రి హత్యకు గురికావడం, తండ్రి హత్య కేసులో తల్లి జైలుకెళ్లడంతో వీళ్ల ఇద్దరు కొడుకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పిల్లలను ఆమె తల్లిదండ్రులు గానీ, అతని తల్లిదండ్రులు గానీ చూసుకోవాలని స్థానికులు సూచించారు. ఊహించని ఈ ఘటనతో తండ్రిని కోల్పోయి, తల్లికి దూరమై చిన్న వయసులోనే ఆ పిల్లలకు పెద్ద కష్టం వచ్చింది. మద్యం అన్యాయంగా ఓ కుటుంబాన్ని సంతోషానికి దూరం చేసింది. వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఓ నిండు ప్రాణం పోయేందుకు కారణమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alcohol, Crime news, Tamilnadu, Wife kills husband