సోనిపట్: ఆమె భర్త ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు. భర్త చనిపోయాక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కొన్నాళ్లకు ఈ విషయం గ్రామస్తులకు తెలిసి వాళ్లిద్దరికీ పెళ్లి చేశారు. ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. ఆ పిల్లలను మనతో పాటే ఉంచుకుందామని ఆమె కన్న పేగు బంధం తెంచుకోలేక రెండో భర్తను కోరింది. అతను అందుకు అంగీకరించకపోవడంతో భార్యాభర్తలిద్దరి మధ్య పెళ్లయిన కొన్నాళ్లకే గొడవలు మొదలయ్యాయి.
పిల్లలను తనతోనే ఉంచుకుంటానని.. ఇంటికి తీసుకొస్తానని ఆ మహిళ.. అలా చేస్తే చంపేస్తానని సదరు భర్త.. ఇలా గొడవలు జరుగుతుండగా ఆ మహిళ దారుణ హత్యకు గురై అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం గ్రామానికి సమీపంలోని ఓ రోడ్డు పక్కన కనిపించింది. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షాదీపూర్ ప్రాంతానికి చెందిన నీతూ అనే మహిళను.. హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన సుందర్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అయితే.. దురదృష్టవశాత్తూ సుందర్ ఎనిమిది నెలల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత పిల్లలతో కలిసి అత్తింట్లో ఉన్న నీతూకు అదే గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. వీళ్లిద్దరూ చనువుగా ఉంటున్న విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. గ్రామ పెద్దల ముందుకు వ్యవహారం వెళ్లింది. నీతూను దినేష్ పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అలా దినేష్, నీతూ పెళ్లి జరిగింది. ఆరు నెలల పాటు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి అత్తింట్లో నీతూకు వేధింపులు మొదలయ్యాయి. తన ముగ్గురు పిల్లలను తెచ్చుకుందామని నీతూ కోరగా ఆమె భర్త అందుకు నిరాకరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. పైగా.. పిల్లలను తీసుకొస్తే చంపేస్తానని దినేష్ ఆమెను బెదిరించాడు. అంతటితో ఆగకుండా.. కట్నం కోసం ఆమెను వేధించాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవలు నడుస్తున్న క్రమంలో నీతూ దారుణ హత్యకు గురైంది.
ఆమెను ఇటుకతో కొట్టి తీవ్రంగా గాయపరిచి.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నీతూను కొట్టి చంపిన దినేష్ ఆమె మృతదేహాన్ని రాత్రి సమయంలో ఊరి జనం ఎవరి కంటపడకుండా భందేరి రోడ్‌లో పడేసి వచ్చినట్లు తెలిసింది. అటుగా నడుచుకుంటూ వెళుతున్న గ్రామస్తులు రోడ్డు పక్కన మహిళ శవం చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించి నీతూ మృతదేహంగా గుర్తించారు. నీతూను పెళ్లి చేసుకుని ఆమెను హత్య చేసిన దినేష్‌పై పోలీసులు హత్య కేసుతో పాటు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నీతూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గొహనాలోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Love marriage, Wife murdered