41 ఏళ్ల తర్వాత మళ్లీ అరెస్ట్... గొర్రెను దొంగిలించాడని...

Tripura : గొర్రెను ఎత్తుకుపోయిన బచ్చు కౌల్... 41 ఏళ్ల కిందట అరెస్టయ్యాడు. తిరిగి మళ్లీ ఇప్పుడు అదే కేసులో అరెస్టయ్యాడు. ఇప్పుడాయన వయస్సు 58 ఏళ్లు. ఎందుకిలా? ఆ కేసు సంగతేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 9:19 AM IST
41 ఏళ్ల తర్వాత మళ్లీ అరెస్ట్... గొర్రెను దొంగిలించాడని...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
త్రిపుర రాజధాని అగర్తల నుంచీ 12 కిలోమీటర్ల దూరంలో మెఘ్లీపారా టీ ఎస్టేట్ ఉంది. అక్కడకు వెళ్లిన పోలీసులు... టీ గార్డెన్ వర్కర్‌గా పనిచేస్తున్న 58 ఏళ్ల బచ్చు కౌల్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కోర్టు ఆయన్ని అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 1978లో బచ్చు, ఆయన తండ్రి మోహన్ కౌల్ కలిసి... కుముద్ రంజన్ భౌమిక్ ఇంట్లోని గొర్రను ఎత్తుకుపోయారు. అప్పట్లో బచ్చు ఆ ఇంట్లో పనిచేసేవాడు. గొర్రెను మార్గెట్లో అమ్మబోతూ... పోలీసులకు చిక్కారు. ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచీ ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఎక్కడున్నారో, ఎటు వెళ్లారో పోలీసులకు తెలియలేదు. ఆ తర్వాత ఈ కేసు అటకెక్కింది. పోలీసులు కూడా పెండింగ్‌లో ఉంచి, మర్చిపోయారు.

ప్రస్తుతం గొర్రె ఓనర్ వయస్సు 83. ఆయన ఇటీవల పోలీసుల్ని కలిసి... గొర్రె చోరీ కేసు ఎంతవరకూ వచ్చిందని అడిగాడు. పోలీసులు లైట్ తీసుకున్నారు. అతను జిల్లా కోర్టుకు వెళ్లాడు. కేసు సంగతి తేల్చాలని జిల్లాకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. దాంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఏం తేలిందంటే... బచ్చు తండ్రి మోహన్ కౌల్... అదరానీ టీ ఎస్టేట్‌లో పనిచేస్తూ... 20 ఏళ్ల కిందటే చనిపోయాడు. అతని బంధువొకాయన మెఘ్లీపారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. ఆ బంధువు ఎవరో కాదు... బచ్చు కౌల్. పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేశారు. గొర్రెను చోరీ చేసినట్లు ఒప్పుకున్న బచ్చు కౌల్... తాను తిరిగి అరెస్టవుతానని అస్సలు ఊహించలేదని చెప్పాడు.

బచ్చు కౌల్‌పై మనం జాలి పడాల్సిన పనిలేదు. బెయిల్ తర్వాత అతను, అతని తండ్రి... చాలాసార్లు కోర్టు విచారణలకు రాలేదు. పోలీసుల కంటపడకుండా బతికారు. కానీ... పోలీసుల నుంచీ తప్పించుకోవడం కష్టమే. నేరం చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి వాళ్లైనా... చట్టం నుంచీ తప్పించుకోలేరని మరోసారి ఈ కేసు నిరూపించింది.
Published by: Krishna Kumar N
First published: September 15, 2019, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading