భగల్‌పూర్: భర్త వేధిస్తున్నాడని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలో చాలా జరిగాయి. కానీ.. భార్య తీరుతో విసిగిపోయిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఘటనే బీహార్‌లోని భగల్‌పూర్‌లో చోటుచేసుకుంది. భార్య, అత్త వేధింపులు భరించలేక విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిగుసరై ప్రాంతానికి చెందిన రణ్‌ధీర్ ఖగాడియా ప్రాంతంలోని పరమానంద్‌పూర్ గ్రామానికి చెందిన రాధ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2018లో వీరి వివాహం జరిగింది. పెళ్లయన కొన్ని నెలలు భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉన్నారు. అత్తింటి వారు కూడా రణ్‌ధీర్‌ను బాగానే చూసుకునేవారు.
కానీ.. రానురాను భార్య ప్రవర్తన మారింది. కట్టుకున్న భార్య, అత్తింటి వారు రణ్‌ధీర్‌ను పలు విధాలుగా వేధించారు. తమ కూతురికి విడాకులు ఇవ్వాలని, వేరే పెళ్లి చేస్తామని అత్త అతనిని బెదిరించింది. భార్య కూడా నువ్వంటే ఇష్టం లేదంటూ సూటిపోటి మాటలతో వేధించేసరికి రణ్‌ధీర్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి వచ్చేందుకు ఇష్టపడకపోవడం, భార్య దూరం కావడం వంటి పరిణామాలు రణ్‌ధీర్‌ను తీవ్రంగా బాధించాయి.
ఈ క్రమంలోనే.. బుధవారం అర్ధరాత్రి రణ్‌ధీర్ తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో రణ్‌ధీర్ తండ్రికి అనుమానమొచ్చి కొడుకు ఉంటున్న క్వార్టర్స్‌కు వెళ్లి చూశాడు. లోపల లాక్ చేసి ఉంది. దీంతో.. కంగారుపడిన ఆయన సన్నిహితులకు సమాచారం అందించాడు. డోర్ బద్ధలుకొట్టి చూడగా కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు.
32 ఏళ్ల కొడుకు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాడని అప్పటి వరకూ సంతోషించిన ఆ తండ్రి కన్న కొడుకును అలా విగత జీవిగా చూసి కుప్పకూలిపోయాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించగా రణ్‌ధీర్ ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు రణ్‌ధీర్ అందులో రాశాడు. రణ్‌ధీర్ తండ్రి ఫిర్యాదుతో అతని భార్య, అత్తపై చిత్రగుప్త నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రణ్‌ధీర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ ఉద్యోగం, అందమైన భార్యతో సంతోషంగా జీవితం సాగించాలనుకున్న రణ్‌ధీర్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో అతని సొంతూరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో మంచిగా ఉండే అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఇరుగుపొరుగు వారు ఆవేదన వ్యక్తం చేశారు. రణ్‌ధీర్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Couples, Crime news, Husband commits suicide, Wife